రూ. 4.33 లక్షల కోట్లకు చేరుకున్న తెలంగాణ అప్పులు 

రాష్ట్ర అవిర్భావ సమయంలో అతి తక్కువ అప్పులతో ఉన్నతెలంగాణ  నేడు లక్షల కోట్ల అప్పులు చేసిందని కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఏటా పెరుగుతూనే ఉన్నాయంది. 2021 – 22 నాటికి రూ. 2.83 లక్షల కోట్లుగా ఉన్న తెలంగాణ అప్పులు,  2022 అక్టోబర్ నాటికి రూ. 4.33 లక్షల కోట్లకు చేరిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి  తెలంగాణ అప్పుల చిట్టాను వివరించారు. 12 బ్యాంకుల నుంచి కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలే రూ. 1.3 లక్షల కోట్లుగా ఉన్నట్లు తెలిపారు.

2014లో తెలంగాణ ఆవిర్భావం నాటికి రాష్ట్ర అప్పులు రూ.75,577 కోట్లు ఉన్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ. 2.83 లక్షల కోట్లకు పెరిగాయని, 2022 అక్టోబర్ నాటికి రూ.4.33 లక్షల కోట్లకు చేరాయని తెలిపారు. ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పు అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఏటా పెరుగుతూనే ఉన్నాయని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లుగా అప్పులు చేస్తోందని,  రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాలా తీసే పరిస్థితులు తీసుకొస్తోందని బీజేపీ, కాంగ్రెస్ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. మిగులు బడ్జెట్ తో ఏర్పాటైన రాష్ట్రాన్ని నేడు అత్యధిక అప్పులున్న రాష్ట్రాల జాబితాలో చేర్చారని విపక్ష నేతలు బీఆర్ఎస్ సర్కార్ పై విరుచుకుపడుతున్నారు.

తెచ్చిన అప్పులను కూడా సరైన రీతిలో వినియోగించడం లేదని,  యథేచ్ఛగా నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని దుయ్యపడుతున్నారు. ఈ విమర్శలను తిప్పికొడుతున్న సర్కార్  తెచ్చిన అప్పులతో అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోందని అంటోంది. తద్వారా భవిష్యత్తులో రాష్ట్రానికి భారీ మొత్తంలో రెవెన్యూ వస్తుందని చెబుతోంది.

మరోవైపు, మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోను అప్పులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. 2019తో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. ఈ మేరకు ఏపీ అప్పుల చిట్టాను కేంద్ర ఆర్థికశాఖ మరోసారి బయటపెట్టిన విషయం తెలిసిందే.

ఏపీ అప్పులపై రాజ్యసభలో తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి 2019 నుంచి 2023 వరకు పెరిగిన అప్పుల వివరాలను వెల్లడించారు. 2023 బడ్జెట్ అంచనాల ప్రకారం ఏపీ అప్పులు రూ. 4,42,442 కోట్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు.