హెచ్1బి, ఎల్1 వీసాల పునరుద్ధరణకు శ్రీకారం

‘దేశీయ వీసా రీ వ్యాలిడేషన్’ పేరుతో హెచ్1బి, ఎల్1 వీసాలను పునరుద్ధరించేందుకు అమెరికా శ్రీకారం చుట్టింది. పైలెట్ ప్రాజెక్టు కింద దేశంలో (అమెరికా)ఈ ఏడాది చివరి నుంచి 2024 వరకు కొన్ని విభాగాలకు చెందిన నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలను ముఖ్యంగా హెచ్1బి వీసాలను రెన్యూ, స్టాంపింగ్ చేయడం వంటివి చేస్తారు.

హెచ్1బి వీసా హోల్డర్లు సంబంధిత గడువు తేదీలోగా దేశం వెలుపలే వీసాల రెన్యువల్, పాస్‌పోర్టుల స్టాంపింగ్ వంటివి చేయించుకోవాలి. లేదంటే అమెరికా వెళ్లేందుకు అనర్హులుగా పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుందని యుఎస్ కాన్సులేట్ అంటోంది.

లేఆఫ్స్‌కు గురయిన ఉద్యోగుల వీసా పునరుద్ధరణకు కొంత సమయం పడుతుంది. ఆ లోగా వీసా గడువు దాటితే దేశం వదిలి వెళ్లిపోవాలి. లేదా కొత్త ఉద్యోగం వెతుక్కొని వీసా రెన్యువల్ చేయించుకోవాలి. దానితో ఓ వైపు వీసా రెన్యువల్, మరో వైపు ఉన్న ఉద్యోగం పోయి కొత్త ఉద్యోగం దొరుకుతుందా లేదా అన్న సందిగ్ధంతో వారు ఆందోళన చెందుతున్నారు.

ఈ ఆందోళనలపై అమెరికాలో నివసిస్తున్న విదేశీయులు జో బైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. వీసాల రెన్యువల్ విషయంలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో వీసాల విషయంలో జో బైడెన్ ప్రభుత్వం విధించిన నిబంధనలు సడలించింది.

అమెరికా వీడి వెళ్లాల్సిన అవసరం లేకుండా దేశీయంగా వీసా పునరుద్ధరణకు అవకాశం కల్పిస్తే వేలాది మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అమెరికాలో రీ స్టాంపింగ్‌కు అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో పాత విధానాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు అమెరికా విదేశాంగ శాఖకు చెందిన అధికారి ఒకరు చెప్పారు.

 స్వల్ప సంఖ్యతో ప్రారంభించి ఒకటి రెండేళ్లలో ఈ సంఖ్యను పెంచుకుంటూ పోతామని ఆ అధికారి చెప్పారు. మరోవైపు అమెరికా వీసాల కోసం భారత్‌లో కొండలా పెరిగిపోయిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించే మరో విధానాన్ని విదేశాంగ శాఖ అమలు చేస్తోంది. ఇతర దేశాల్లోని అమెరికా దౌత్యకార్యాలయాల్లోనూ వీసాల పరిశీలన ప్రారంభించాలని అమెరికా అధ్యక్షుడికి ఓ సలహా సంఘం చేసిన సిఫార్సు మేరకు చర్యలు చేపట్టింది.