మద్యం కుంభకోణంలో ఎంపీ మాగుంట కుమారుడు అరెస్ట్

ఢిల్లీ మద్యం కుంభకోణంలో తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలు వైఎస్సార్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో ప్రశ్నించాక అరెస్టు చేసినట్లు ప్రకటించారు. మధ్యాహ్నం రాఘవను దిల్లీలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు.
 
మాగుంట రాఘవను కూడా కస్టడీకి తీసుకునేందుకు ఈడీ కోర్టు అనుమతి కోరనున్నారు. రాఘవ బాలాజీ గ్రూప్ చైర్మన్ గా ఉన్నారు. సౌత్ గ్రూప్లో రాఘవ కీ రోల్ పోషించినట్లు తెలుస్తోంది.   మాగుంట రాఘవరెడ్డిని గతేడాది అక్టోబర్‌లో సీబీఐ ప్రశ్నించింది. అప్పుడే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను కూడా విచారణకు పిలిచారు.
ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వరుసగా పలువురిని అరెస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ కేసులో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువుర్ని ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసింది.  ఢిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్‌షీట్‌లో ఇటీవల కొన్ని పేర్లు బయటపడ్డాయి.
ఢిల్లీ సీఎ కేజ్రీవాల్‌ పేరు తొలిసారి తెరపైకి రాగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఏపీకి చెందిన వైఎస్సార్సీపీ ఎంపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిల పేర్లు ప్రస్తావించారు.  ఈ ఛార్జిషీట్‌లో సమీర్‌ మహేంద్రు, విజయ్‌నాయర్‌, అభిషేక్‌ బోయినపల్లి, శరత్‌చంద్రారెడ్డి, బినోయ్‌బాబు, అమిత్‌ అరోరాలను నిందితులుగా చేర్చారు.
మొన్నటి వరకు ఈ స్కాంతో సంబంధం లేదని ఎంపీ మాగుంట చెబుతుండగా ఇప్పుడు ఉన్నట్టుండి కుమారుడి అరెస్ట్‌ చేయడం ఏపీ రాజకీయాల్లో కలకలంరేపుతోంది.