14 శాతం పెరిగిన ఆటో మొబైల్‌ అమ్మకాలు

దేశంలో ఆటో మొబైల్‌ అమ్మకాలు జనవరి, 2023లో 14 శాతం పెరిగాయి. ప్యాసింజర్‌ కార్లు, టూ వీలర్స్‌, ట్రాక్టర్ల అమ్మకాలు పండగ సీజన్‌ వల్ల పెరిగాయని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల డీలర్స్‌ అసోసియేషన్‌ (ఎఫ్‌ఏడీఏ) తెలిపింది. మొత్తం వాహనాల అమ్మకాలు జనవరిలో 18.27 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. 2022 జనవరిలో 16.08 లక్షల యూనిట్ల అమ్మకాలు జరిగాయి.
 
ప్యాసింజర్‌ కార్ల రిజిస్ట్రేషన్లు జనవరిలో 22 శాతం పెరిగి, 3.40 లక్షలుగా నమోదయ్యాయి. టూ వీలర్స్‌ అమ్మకాలు గత సంవత్సరంతో పోల్చితే 10 శాతం పెరిగి 12.65 లక్షలుగా ఉన్నాయి. త్రిచక్ర వాహనాల అమ్మకాలు 59 శాతం పెరిగాయి. 2023 జనవరిలో 65,796 త్రిచక్ర వాహనాల అమ్మకాలు జరిగాయి.
గత ఏడాది ఇదే కాంలో ఇవి 41,48 యూనిట్లుగా ఉన్నాయి.
 
వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్లు జనవరిలో 16 శాతం పెరిగి 82,428 యూనిట్లుగా ఉన్నాయి. గత సంవత్సరం ఇదే కాలంలో 70,853 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.  ట్రాక్టర్ల అమ్మకాలు 8 శాతం పెరిగి 73,156 యూనిట్లుగా ఉన్నాయ. గత ఏడాది ఇదే కాలంలో ట్రాక్టర్ల అమ్మకాలు 67,764 యూనిట్లుగా ఉన్నాయి.
 
గత సంవత్సరం జనవరితో పోల్చుకుంటే అమ్మకాలు పెరిగినప్పటికీ, ఇంకా కరోనాకు ముందు 2020 జనవరి అమ్మకాలతో పోల్చుకుంటే ఇంకా 8 శాతం వెనుకబడి ఉన్నామని ఎఫ్‌ఏడీఏ ప్రెసిడెంట్‌ మనీష్‌ రాజ్‌ సింఘానియా అభిప్రాయపడ్డారు. టూ వీలర్స్‌ అమ్మకాలు వృద్ధి కూడా నత్తనడకనే ఉన్నాయని, ఏమైనా గత జనవరితో పోల్చితే పెరిగాయని తెలిపారు.
 
గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఆదాయాలు పెరగపోవడం వల్ల ఆ మార్కెట్‌ నుంచి ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగడంలేదని పేర్కొన్నారు. పాత వాహనాల స్థానంలో కొత్తవాటిని తీసుకోవడం, ప్రభుత్వం మౌలికసదుపాయాల ప్రాజెక్ట్‌లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వాణిజ్య వాహనాల అమ్మకాలు మాత్రం కరోనా  ముందు స్థాయికి చేరుకున్నాయని సింఘానియా చెప్పారు. చైనాలో ఫ్యాక్టరీల కార్యకలాపాలు తిరిగి పుంజుకుంటున్నందున సెమికండక్టర్ల అందుబాటు పెరుగుతుందని, మరోవైపు గ్లోబల్‌ సప్లయ్‌ చైన్‌ కూడా మెరుగుపడుతున్నందున రానున్న రోజుల్లో వాహనాల ఉత్పత్తి మరింత మెరుగుపడుతుందని సింఘానియా భావిస్తున్నారు. ఉత్పత్తి పెరిగితే వాహనాల కోసం ముఖ్యంగా కార్ల కోసం ఎదురు చూసే సమయం తగ్గుతుందని ఆయన చెప్పారు.

ప్రముఖ కార్ల కంపెనీలన్నీ కూడా భారీగా ఎయిటింగ్‌ జాబితా కలిగి ఉన్నాయి. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీల కార్ల కోసం బుక్‌ చేసుకున్నవారు నెల రోజుల నుంచి 4 నెలల వరకు వెయిటింగ్‌ పీరియడ్‌ నడుస్తోంది.