
కళాతపస్వి విశ్వనాథ్ మృతి తన దిగ్భ్రాంతికి లోనయ్యానని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. సినీ పరిశ్రమ ఓ గొప్ప మేధావిని కోల్పోయిందని ఆమె చెప్పారు. ఆయన దర్శకత్వం వహించిన శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం వంటి చిత్రాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని గవర్నర్ తెలిపారు.
సౌండ్ రికార్డిస్ట్‌గా సినీ ప్రస్థానం ప్రారంభించి తెలుగు సినిమా స్థాయిని విశ్వవ్యాప్తం చేశారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. విశ్వనాథ్ దర్శకుడిగా తొలి అడుగుతోనే నంది అవార్డుతో ప్రారంభించారని మెచ్చుకున్నారు.పితృసమానులు, గురువు కళా తపస్వి విశ్వనాథ్ గురంచి ఎంత చెప్పిన తక్కువ అవుతుంది, ఎంత చెప్పిన మాటలు చాలడం లేదని నటుడు చిరంజీవి అన్నారు. శంకరాభరణం విడుదలైన రోజునే ఆయన శివైక్యం చెందారని తెలిపారు.
కే విశ్వనాథ్ మృతిపట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. అతి సామాన్యమైన కథను ఎంచుకొని తన అద్భుతమైన ప్రతిభతో వెండితెర దృశ్య కావ్యాలుగా మలిచిన అరుదైన దర్శకుడు కె. విశ్వనాథ్ అని కొనియాడారు. గతంలో కె.విశ్వనాథ్ ఆరోగ్యం బాగాలేనప్పుడు వారి ఇంటికి వెళ్లి పరామర్శించిన సమయంలో సినిమాలు, సంగీతం, సాహిత్యంపై తమ మధ్య జరిగిన చర్చను సీఎం ఈ సందర్భంగా గుర్తుచేసుకొన్నారు. భారతీయ సామాజిక సంస్కృతి సంప్రదాయ విలువలకు తన సినిమాలో పెద్దపీట వేశారని సీఎం కేసీఆర్ చెప్పారు.
కె.విశ్వనాథ్ మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్ గారు. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీరంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చాయి. తెలుగువారి గుండెల్లో కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారు’ అంటూ ట్వీట్ చేశారు.
కళాఖండాలుగా నిలిచిన అనేక చిత్రాలను అందించిన విశ్వనాథ్ మృతి తనను తీవ్రంగా కలచివేసిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటని పేర్కొన్నారు. విశ్వనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
విశ్వనాథ్ కన్నుమూతపై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగంగా స్పందించారు. ‘‘ ఇది అత్యంత విషాదకరమైన రోజు. పితృ సమానులు కళాతపస్వి కే.విశ్వనాథ్ గారు ఇక లేరు అనే వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన గొప్పతనం గురించి చెప్పటానికి మాటలు చాలవు. పండితులని పామరులనీ కూడా ఒకేలా మురిపించే ఆయన చిత్రాల శైలి విశిష్టమైంది. ఆయనలా సున్నితమైన ఆర్ట్ ఫిలిమ్స్‌ని కూడా బ్లాక్ బస్టర్ హిట్స్‌గా మలిచిన దర్శకుడు బహుశా ఇంకొకరు లేరు. తెలుగుజాతి ఖ్యాతిని తన సినిమాల ద్వారా ప్రపంచ స్థాయికి తీసికెళ్లిన మహా దర్శకుడు ఆయన” అంటూ ట్వీట్ చేశారు.
‘ప్రపంచంలో ఎవ్వరైనా మీ తెలుగు సినిమా గొప్పదనం ఏంటి అని అడిగితే.. మాకు కె.విశ్వనాథ్ గారు ఉన్నారని రొమ్ము విరిచి గర్వంగా చెప్పుకుంటాం. తెలుగు చిత్ర పరిశ్రమ మిమ్మల్ని ఎప్పటి మర్చిపోలేదు. సినిమా గ్రామర్‌లో మీరు నేర్పిన పాత్రలకు ఆజన్మాన్తo రుణపడి ఉంటాం సర్’ అంటూ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి నివాళులు అర్పించారు.
జూనియర్ ఎన్టీఆర్ ఆయనకు సంతాపం ప్రకటించారు. ‘‘తెలుగు సినిమా ఖ్యాతిని ఖండంతరాలుగా వ్యాపింపజేసిన వారిలో విశ్వనాథ్‌ది ఉన్నతస్థానం. శంకరాభరణం, సాగర సంగమం లాంటి ఎన్నో అపురూప చిత్రాలను అందించారు. ఆయన లేని లోటు ఎన్నటికీ తీరనిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలనుకుంటున్నాను’’ అని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు.
More Stories
సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ దోషి
హైదరాబాద్ శివాలయంలో మాంసపు ముద్దలు
అయోధ్య రామమందిరం ప్రధాన పూజారి కన్నుమూత