రామజన్మభూమి కాంప్లెక్స్‌కు బాంబు బెదిరింపు

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి పనులు పూర్తి చేసి భక్తులకు శ్రీరాముడి దర్శన భాగ్యం కల్పిస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో రామజన్మభూమి కాంప్లెక్స్‌కు తాజాగా బాంబు బెదిరింపు రావడం కలకలం రేగుతోంది.
 
రామజన్మభూమి కాంప్లెక్స్‌ను పేల్చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తి తనకు బెదిరింపు కాల్‌ చేసినట్లు స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి పోలీసులకు తెలిపాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు  ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.  అయోధ్య పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అయోధ్యలోని రాంలాలా సదన్‌కు చెందిన మనోజ్‌ కుమార్‌ ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో నివాసముంటున్నాడు.
 
ఈ క్రమంలో గురువారం మనోజ్‌కు ఓ వ్యక్తి బెదిరింపు కాల్‌ చేశాడు. మరికొన్ని గంటల్లో శ్రీరామ జన్మభూమి ఆలయాన్ని బాంబుతో పేల్చేస్తామని బెదిరించి కాల్‌ పెట్టేశాడు. దీంతో భయాందోళనకు గురైన మనోజ్‌ ఈ విషయాన్ని వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అయోధ్య పోలీసులు తెలిపారు.
కాల్‌ ట్రాకింగ్‌ ఆధారంగా దుండగుడిని గుర్తించి త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని వెల్లడించారు. గుర్తు తెలియని వ్యక్తిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. బెదిరింపు కాల్‌ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసుల బృందం స్పెషల్‌ ఆపరేషన్‌ను చేపట్టింది. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. బెదిరింపు కాల్‌ నేపథ్యంలో అయోధ్యలో పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు. ఆలయ సముదాయం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు.

ముంబయిలో దాడి చేస్తాం.. ఎన్ఐఏకి అగంతకుల మెయిల్

ఇలా ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో దాడులు చేస్తామంటూ గుర్తుతెలియని దుండగుల నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) కి శుక్రవారం ఈమెయిల్ వచ్చింది. తాలిబన్ల నాయకుడు సిరాజుద్దీన్ హక్కానీ ఆదేశాలతో ముంబయిలో మారణహోమం సృష్టిస్తామని మెయిల్ లో పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన ఎన్ఐఏ అధికారులు ముంబయి సహా దేశంలోని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు.

ఆయా రాష్ట్రాలకు చెందిన పోలీసులకు సమాచారం అందించారు. ముఖ్యమైన, సమస్యాత్మకమైన ప్రాంతాలలో భద్రత పెంచాలని సూచించారు. ఈ సూచనలతో ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు. నగరంలోని పలుచోట్ల భద్రత పెంచడంతో పాటు తనిఖీలు నిర్వహిస్తున్నారు.