వివాదాల పరిష్కారానికి షరియత్ కౌన్సిల్ కోర్టులు కావు!

షరియత్ కౌన్సిల్ వంటి ప్రైవేట్ సంస్థలు కాకుండా కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించి ‘ఖులా’ (భార్య విడాకుల ప్రక్రియ) ద్వారా వివాహాన్ని రద్దు చేసుకునే హక్కును ముస్లిం మహిళ వినియోగించుకోవచ్చని మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఖులా ద్వారా ప్రయివేట్ సంస్థలు విడాకులు నిర్దారించలేవని స్పష్టం చేసింది. మొఘల్ లేదా బ్రిటీష్ పాలనలో ‘ఫత్వా’ హోదా ఏదైనా కావచ్చు, స్వతంత్ర భారతదేశ రాజ్యాంగంలో దానికి స్థానం లేదని కోర్టు స్పష్టం చేసింది.
 
 ‘వివాదాల పరిష్కారానికి అవి కోర్టులు లేదా మధ్యవర్తులు కాదు.. న్యాయస్థానాలు కూడా ఇటువంటి ఆచారాలను తీవ్రంగా వ్యతిరేకించాయి’ అని వ్యాఖ్యానించారు. ప్రయివేట్ సంస్థలు జారీచేసే విడాకుల ధ్రువపత్రాలు చెల్లుబాటుకావని తేల్చిచెప్పింది.  ‘‘ఖులా అనేది భర్త తలాక్ మాదిరిగానే భార్యకు ఇచ్చే విడాకుల హక్కు’’ అని మద్రాస్ హైకోర్టు పునరుద్ఘాటించింది.
 
తన భార్యకు జారీ చేసిన ఖులా సర్టిఫికేట్‌ను రద్దు చేయాలని కోరుతూ ఒక వ్యక్తి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ మేరకు జస్టిస్ సి శరవణన్ 2017లో తమిళనాడు షరియత్ కౌన్సిల్ తౌహీద్ జమాత్ జారీచేసిన సర్టిఫికెట్ రద్దు చేశారు.  2017 నాటి బాదర్ సయీద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మద్రాస్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు మంజూరు చేసింది.
 
ఖులా ద్వారా వివాహాన్ని రద్దు చేసినట్లు ధృవీకరించే పత్రాలను జారీ చేయకుండా ఆ విషయంలో ప్రతివాదులు (కాజీలు) వంటి సంస్థలను నిలువరించింది. ‘‘ముస్లిం పర్సనల్ లా (షరియత్) చట్టం 1937 ప్రకారం కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఖులా ద్వారా వివాహాన్ని రద్దు చేసుకునేందుకు ముస్లిం మహిళ తన విడదీయరాని హక్కులను వినియోగించుకునే అవకాశం ఉంది’’ అని తీర్పులో పేర్కొంది.

అంతేకాదు, వివాదాన్ని పరిష్కరించుకోడానికి తమిళనాడు లీగల్ సర్వీసెస్ అథారిటీ లేదా కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని పిటిషనర్, అతడి భార్యకు సూచించింది. ఈ విషయంలో విశ్వ మదన్ లోచన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2014 నాటి సుప్రీంకోర్టు తీర్పును పిటిషనర్ ఉదహరించాడు.

 
రిట్ పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు, మక్కా మసీదు షరియత్ కౌన్సిల్‌ను ప్రస్తావిస్తూ ‘కోర్టు పనితీరు’ అనే అభిప్రాయాన్ని ప్రజలకు తెలియజేస్తుందని పిటిషనర్ ఉదహరించారు. విడాకులను రద్దుచేయాలని పిటిషనర్ వాదించాడు. ప్రేమికులైన వీరికి పెళ్లి కాకుండానేఈ జంటకు మగబిడ్డ పుట్టగా.. 2013లో వివాహం చేసుకున్నారు. ఈ అంశం కుటుంబన్యాయస్థానంలో పెండింగ్‌లో ఉంది.