కృత్రిమ మేధకోసం 3 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు

మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా దేశంలో మూడు అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్‌ఎఐ)కోసం మూడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అలాగే 5జి సర్వీసులను ఉపయోగించుకునే అప్లికేషన్లను అభివృద్ధి చేయడం కోసం ఇంజనీరింగ్ కాలేజిల్లో 100 ల్యాబ్‌లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.

‘మూడు అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో కృత్రిమ మేధ కోసం మూడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకటికన్నా ఎక్కువ విజ్ఞాన శాఖల్లో పరిశోధనలు నిర్వహించడంలో,అలాగే వ్యవసాయం, ఆరోగ్యం,సుస్థిర నగరాలకు చెందిన రంగాల్లో అత్యధునాతనమైన ప్లికేషన్లను అభివృద్ధి చేయడంతో పాటుగా పరిష్కరించదగిన సమస్యల పరిష్కారాలను కనుగొనడంతో ప్రముఖ పారిశ్రామిక సంస్థలు భాగస్వాములుగా ఉంటాయి’ అని ఆర్థికమంత్రి తన ప్రసంగంలో తెలియజేశారు.

5జి సేవలను ఉపయోగించుకునే అప్లికేషన్లను అభివృద్ధి చేయడం కోసం వివిధ అథారిటీలు, రెగ్యులేటర్లు, బ్యాంకులు, ఇతర వ్యాపార సంస్థల తోడ్పాటుతో ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో 100 ల్యాబ్‌లను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆర్థిక మంత్రి చెప్పారు.

హోం మంత్రిత్వ శాఖకు రూ 1.96లక్షల కోట్లు

కేంద్ర బడ్జెట్‌లో అంతర్గత భద్రతకు ప్రాధాన్యతను ఇచ్చే దిశలో హోం మంత్రిత్వ శాఖకు రూ 1.96 లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో అత్యధికం కేంద్ర సాయుధ బలగాలైన సిఆర్‌పిఎఫ్, ఇంటలిజెన్స్ దళాలకు ఖర్చుల కోసం చెందుతాయి. అమిత్ షా సారధ్యపు హోం మంత్రిత్వశాఖకు ఈ సారి బడ్జెట్‌లో కేటాయింపులు రూ 1,96,034.94 కోట్లు, 2022- 23 బడ్జెట్‌లో ఇది రూ 1,85,776.55 కోట్లుగా ఉంది.
 
ఇప్పుడు ఇతోధికంగా పెంచిన కేటాయింపులతో అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి మౌలిక సాధనాసంపత్తిని పెంచడం, పోలీసు వ్యవస్థ బలోపేతం, ఆధునీకరణ పనులు వేగవంతం చేస్తారు. ఇప్పుడు కేటాయించిన మొత్తంలో అత్యధిక వాటా కేంద్రీయ సాయుధ పోలీసు బలగాలకు (సిఎపిఎఫ్)కు చెందుతుంది. ఇది రూ 1,27,756.74 కోట్లుగా ఉంటుంది.
 
ఇంతకు ముందు బడ్జెట్ 2022 23లో ఇది రూ 1,19,070గా ఉంది. ఇందులో అంతర్భాగంగా ఉంటూ అంతర్గత భద్రతను పర్యవేక్షించే ప్రత్యేకించి జమ్మూ కశ్మీర్‌లో తీవ్రవాదం, ఉగ్రవాదం ఏరివేత పనులలో ఉండే సిఆర్‌పిఎఫ్‌కు ఈసారి రూ 31,772.23 కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ 31,495.88 కోట్లుగా ఉంది.