దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ గురువారం అట్టహాసంగా జరిగింది. కర్తవ్యపథ్‍లో ముందుగా జాతీయ జెండాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. దీంతో రిపబ్లిక్ డే పరేడ్ మొదలైంది. ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఫతా ఇల్ సిసి.. గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాగతం పలికారు.
భారత సాయుధ దళాల అపార సామర్థ్యం, సాంస్కృతి వైవిధ్యం, సమ్మేళనం, మహిళా శక్తిని ప్రతిబింబిస్తూ పరేడ్ జరిగింది. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ పరేడ్‍లో కేవలం దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధాల వ్యవస్థలనే భారత సాయుద దళాలు ప్రదర్శించాయి. ఈసారి రష్యా యుద్ధ ట్యాంకులు కూడా లేవు. తొలిసారి ఇలా ఏ విదేశీ ఆయుధాలు లేకుండా రిపబ్లిక్ డే పరేడ్ జరిగింది.
ఆత్మనిర్భర్ భారత్‍ను ఇది ప్రతిబింబించింది. రిపబ్లిక్ డే పరేడ్‍లో అగ్నివీరులు మొదటిసారి పాలుపంచుకున్నారు. నావికా దళ బృంద కవాతులో ఆరుగురు అగ్నివీరులు కూడా పాల్గొన్నారు. నవభారతం, అత్మనిర్భర్ భారత్ అంశాలకు ప్రతీకగా పరేడ్ సాగింది. సైనిక విన్యాసాలు ఆశ్చర్యపరిచాయి. రాష్ట్రాలు, ప్రభుత్వ శాఖల శకటాలు ఆకట్టుకున్నాయి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) తరఫున మహిళా దళం పరేడ్‍లో కవాతు నిర్వహించింది.
పూర్తి మహిళలతో కూడిన బృందం రిపబ్లిక్ డే పరేడ్‍లో కవాతు నిర్వహించడం ఇదే తొలిసారి. భారత వైమానిక దళం విన్యాసాలు రిపబ్లిక్ డే పరేడ్‍లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఎయిర్ ఫోర్స్ కు చెందిన 48 విమానాలు ఆకాశంలో విన్యాసాలు చేశాయి. వీటితో పాటు ఆర్మీ, నేవి దళాలు కూడా విన్యాసాలు చేశాయి. త్రివిధ దళాల విన్యాసాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‍తో పాటు మొత్తంగా 17 రాష్ట్రాల శకటాలు పరేడ్‍లో ప్రదర్శనకు వచ్చాయి. నారీశక్తి థీమ్‍తో రూపొందిన శకటాలు ఆకట్టుకున్నాయి. ప్రభల తీర్థం వేడుకను ప్రతిబింబిస్తూ రూపొందిన ఆంధ్రప్రదేశ్ శకటం ప్రత్యేకతగా నిలిచింది. కేంద్ర పాలిత ప్రాంతాలు, ప్రభుత్వ శాఖల శకటాలు కూడా పరేడ్ కు వచ్చాయి. సిగ్నల్స్ డేర్ డెవిల్స్ కాప్స్ బృందం నిర్వహించిన మోటార్ బైక్ విన్యాసాలు ఆశ్చర్యపరిచాయి. సాయుద దళాల బృందాల కవాతు, ఆర్మీ, నేవి, వాయుసేనల విన్యాసాలు, శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మరిన్ని వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. జాతీయ గీతాలాపనతో పరేడ్ ముగిసింది.
More Stories
హిందూ వివాహం అంటే ఒక కాంట్రాక్ట్ కాదు
ఆధార్ ఉచిత అప్డేట్ గడువు మరోసారి పొడిగింపు
కఠువా ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం