మహిళల ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి కాసుల పంట

మహిళల ఐపీఎల్ ద్వారా బీసీసీఐ పంట పండనుంది. మహిళల ఐపీఎల్ జట్ల వేలం ద్వారా బీసీసీఐకి రూ. 4వేల కోట్లు దక్కనున్నాయి. జనవరి 25న ఐపీఎల్ మహిళల జట్ల వేలం జరగనుంది. ఈ వేలంలో 30  కంపెనీలు పాల్గొంటున్నాయి. ఇందులో పురుషుల ఐపీఎల్ జట్లను కొనుగోలు చేసిన కంపెనీలతో పాటు..మాంచెస్టర్ యునైటెడ్, హల్దీరామ్ వంటి కంపెనీలు టెండర్ల దరఖాస్తులను కొనుగోలు చేశాయి.

ఈ కంపెనీలు రూ. 500 కోట్ల నుంచి రూ. 600 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది.  దీంతో మహిళల ఐపీఎల్ ద్వారా బీసీసీఐ ఖజానా మరింత నిండనుంది. మరోవైపు ఇప్పటికే మహిళల ఐపీఎల్ ప్రసార హక్కులను వయాకామ్ 18 దక్కించుకుంది. ఐదేళ్ల కాలానికి రూ. 951 కోట్లకు మీడియా రైట్స్ కొనుగోలు చేసింది. ఇందులో భాగంగా ఒక్కో మ్యాచ్ కు వయాకామ్18 రూ. 7.09 కోట్లు బీసీసీఐకి చెల్లించనుంది. 

అటు ఉమెన్స్ ఐపీఎల్ విజేతకు భారీగా ప్రైజ్ మనీ దక్కనుంది. ట్రోఫీ విన్నర్ కు రూ. 28.08 కోట్లు అందనున్నాయి. రన్నరప్ కు రూ. 27.20 కోట్లు, తర్వాత స్థానాల్లో నిలిచిన జట్లకు 26.33 కోట్లు, రూ. 25.45 కోట్లు, రూ. 24.57 కోట్లు లభిస్తాయి. విజేతతో పాటు..ఇతర జట్లకు దక్కే ప్రైజ్ మనీ ప్రతీ ఏడాది పెరుగుతుంది. 

మహిళల ఐపీఎల్ మార్చిలో జరగనుంది. మొదటి ఉమెన్స్ ఐపీఎల్ 5 జట్లు 22 మ్యాచులు ఆడనున్నాయి. జనవరి 25న జట్ల పేర్లు వెల్లడించనున్న బీసీసీఐ…ఫిబ్రవరిలో ప్లేయర్ల వేలం నిర్వహించనుంది. వేలంలో ఒక్కో టీమ్ రూ. 12 కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉంది. ఉమెన్స్ ఐపీఎల్ మ్యాచులను ముంబైలోనే నిర్వహించే ఛాన్సుంది. వాంఖడే, డీవై పాటిల్ స్టేడియాల్లో మ్యాచులను నిర్వహిస్తారని సమాచారం.