వివేకా హత్యకేసులో కడప ఎంపీని ప్రశ్నించనున్న సిబిఐ

సుప్రీంకోర్టు ఆదేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై జరుగుతున్న దర్యాప్తును ఆంధ్ర ప్రదేశ్ నుండి తెలంగాణ హైకోర్టు పరిధికి మార్చడంతో సిబిఐ వేగంగా అడుగులు వేయడం ప్రారంభించింది. ఈ కేసులో మొదటిసారిగా ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా పేరొందిన మరోబాబయి కుమారుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని దర్యాప్తు కోసం సిబిఐ పిలిచింది.
 
దానితో ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వపు అండదండలతో దర్యాప్తు నుండి తప్పించుకొంటూ వస్తున్న కీలక వ్యక్తులపై ఇప్పుడు సిబిఐ దృష్టి సారిస్తున్నట్లు స్పష్టం అవుతున్నది. మంగళవారం హైదరాబాద్ లో విచారణకు హాజరుకమ్మనమని కోరింది. అయితే, ముందే అనుకున్న షెడ్యూల్స్ కారణంగా జహారుకాలేనని, ఐదు రోజుల వ్యవధి కావాలని కోరిన్నట్లు చెప్పారు. 
 
కాగా, ఈ హత్యకేసులో గత రెండున్నర సంవత్సరాలుగా తనతో పాటు తన కుటుంబంపై మీడియాలో ఒక వర్గం అసత్య ఆరోపణలు చేస్తోందన్నట్లు అవినాష్ రెడ్డి ఈ సందర్భంగా ఆరోపించారు. తనపై వచ్చిన అభియోగాలను జీర్ణించుకోలేకపోతున్నానని చెబుతూ న్యాయం గెలవాలన్నదే, నిజం వెల్లడి కావాలన్నదే తన ధ్యేయం అని స్పష్టం చేశారు.
 
హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు సోమవారం నుండి పులివెందుల పరిసరాలలో తిరుగుతున్నారు. వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి ఇంటి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అవినాశ్‌ రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి ఇంట్లో ఉన్నారా? అని ఇంటి వద్ద ఉన్న వారిని వాకబు చేశారు. ఆయన లేరని వారు సమాధానం చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లారు. ఆ తర్వాత ఓఎస్డీ కార్యాలయంతోపాటు పులివెందులలోని సీఎం క్యాంప్‌ ఆఫీస్‌కు కూడా వెళ్లారు.
 
అక్కడ భాస్కర్‌ రెడ్డి ఉన్నారేమో అని ఆరా తీశారు. అక్కడ కూడా ఆయన లేరని సమాధానం రావడంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో ఎంపీ అవినాశ్‌ రెడ్డి పులివెందులకు వచ్చారు. కొద్దిసేపటికే సీబీఐ అధికారులు ఆయనను కలిసి… మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసు ఇచ్చారు. సీబీఐ అధికారులు తొలుత అవినాశ్‌ రెడ్డి తండ్రి గురించి ఆరా తీయడం, సాయంత్రానికి ఆయనకే నోటీసు జారీ చేయడం సంచలనం సృష్టిస్తోంది.