ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ నిషేధం

ప్రధాని నరేంద్ర మోదీపై, 2002 గుజరాత్ అల్లర్లపై బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) రూపొందించిన డాక్యుమెంటరీ ని ట్విటర్,యూట్యూబ్ ల్లో షేర్ చేయకుండా నిషేధం విధించారు.

 ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని షేర్ చేయకుండా బ్లాక్ చేయాలని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ట్విటర్, యూట్యూబ్ లను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆ డాక్యుమెంటరీ దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా, దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉందని, అందువల్ల ఆ డాక్యుమెంటరీని షేర్ చేయడాన్ని బ్లాక్ చేయాలని స్పష్టం చేసింది.

ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో బీబీసీ రూపొందించిన ఆ డాక్యుమెంటరీని షేర్ చేయడాన్ని ట్విటర్, యూట్యూబ్ లు నిషేధించాయి. ఆ డాక్యుమెంటరీ షేర్ కాకుండా బ్లాక్ చేశాయి. ఇప్పటికే పబ్లిష్ అయిన వీడియోలను కూడా యూట్యూబ్  డిలీట్ చేసింది. అలాగే, ఆ డాక్యుమెంటరీ ని లింక్ చేసిన 50 కి పైగా ట్వీట్లను ట్విటర్ డిలీట్ చేసింది.

ప్రధాని మోదీని, భారత ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే ప్రచార చిత్రంలా ఆ బీబీసీ డాక్యుమెంటరీ ఉందని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. బ్రిటిష్ వలసవాద మనస్తత్వం అందులో స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది.

ఆ డాక్యుమెంటరీని కేంద్ర విదేశాంగ, సమాచార ప్రసార, హోం శాఖ సీనియర్లు చూసి, అది భారత దేశ ఔన్నత్యాన్ని, సుప్రీంకోర్టు విశ్వసనీయతను దెబ్బతీసేలా ఉందని నిర్ణయానికి వచ్చారు. దేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను తక్కువ చేసే ప్రయత్నమని వారు విమర్శించారు. ఐటీ రూల్స్ ప్రకారం ఆ డాక్యుమెంటరీని షేర్ చేయకుండా బ్లాక్ చేయాలని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ను ఆదేశించారు.