ఎయిర్ ఇండియాకు డిజిసిఎ రూ. 30 లక్షల జరిమానా

మద్యం మత్తులో తోటి ప్రయాణికురాలిపై ఓ ప్రయాణికుడు మూత్రం పోసిన ఘటనపై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఎ) సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యింది. డీజీసీఏ నిబంధనల మేరకు ఎయిరిండియా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేదని మండిపడింది. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది.

అంతేగాక, ఘటనకు వేదికైన న్యూయార్క్‌-ఢిల్లీ విమానం పైలెట్‌ ఇన్‌చార్జి లైసెన్స్‌ను డీజీసీఏ మూడు నెలలపాటు రద్దు చేసింది. తన బాధ్యతల నిర్వహణలో విఫలమైన ఎయిర్ ఇండియా విమాన సర్వీసుల డైరెక్టర్‌కు కూడా రూ.1లక్ష జరిమానాను విధిస్తున్నట్లు డిజిసిఎ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు మహిళపై మూత్రం పోసిన ప్రయాణికుడు శంకర్‌ మిశ్రాపై ఎయిరిండియా మరో నాలుగు నెలల ప్రయాణ నిషేధం విధించింది. గతంలో విధించిన 30 రోజుల ప్రయాణ నిషేధానికి ఇది అదనం.

 గత నవంబర్‌ 26న జరిగిన ఈ ఘటన విషయం ఆలస్యంగా ఈ నెల 4న డీజీసీఏ దృష్టికి వెళ్లింది. దీనిపై డీజీసీఏ సీరియస్‌ అయ్యింది. విషయాన్ని తమ దృష్టికి తీసుకురావడానికి ఎందుకు ఆలస్యం జరిగిందంటూ ఎయిరిండియా అకౌంటబుల్ మేనేజర్‌, ఎయిరిండియా ఫ్లైట్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌కు, సదరు విమానం పైలట్‌లకు, సిబ్బందికి నోటీసులు జారీచేసింది.

విమానంలో సహ ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన శంకర్ మిశ్రా అనే వ్యక్తిని ఢిల్లీ పోలీసులు బెంగళూరులో అరెస్టు చేయగా ఆయనకు కోర్టు జుడిషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.