రూ. 300 కోట్లతో ఖమ్మంలో బిఆర్‌ఎస్ రాజకీయ ఉపాధిహామీ సభ

సిఎం కెసిఆర్ స్పిచ్‌కు పసలేదు, బిఆర్‌ఎస్‌కు దేశంలో ఎక్కడ బసలేదని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఎద్దేవా చేశారు. ఇబ్రహింపట్నం మండల కేంద్రంలోని వైష్ణవి గార్డెన్‌లో బిజెపి నేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అవలంభిస్తున్న విధానాలు రాష్ట్ర భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టివేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

గత ఎన్నికల్లో ఇచ్చిన హామిలు నెరవేర్చడంలో విపలమైన సిఎం బిఆర్‌ఎస్ పేరిట మరో కొత్త నాటానికి తెరలేపారని ఆయన విమర్శించారు. 300 కోట్ల రుపాయలతో ఖమ్మంలో నిర్వహించిన బిఆర్‌ఎస్ సభ రాజకీయ ఉపాధిహామి సభగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు.

అన్ని వనరులు ఉన్న మన దేశంలో ప్రజలు మెక్‌డోనాల్డ్ పిజ్జాలు బర్గర్లు తినడమేమిటంటూ కెసిఆర్ చేసిన వాఖ్యలను ఆయన తప్పు పట్టారు. కాళేశ్వరం, పెరిట లక్షన్నర కోట్లతో కేవలం 5.5 టిఎంసి సామర్థం గల రిజర్వాయర్‌ను నిర్మించారని ఆయన విమర్శించారు. ప్రధాని మోదిని విమర్శిస్తున్న కెసిఆర్ ఎనిమదెళ్లలో వృదాగా పోతున్న వర్షపు నీటికి ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోయారని ఆయన ప్రశ్నించారు.

తొమ్మిదేళ్లలో రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. రాజకీయాలకు, బర్గర్లకు పొంతన ఏముందని పేర్కొంటూ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ ను స్థాపించారని ఆరోపించారు. కేవలం స్వలాభం కోసమే కమ్యూనిస్టు పార్టీలు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నాయని మండిపడ్డారు.

కంటి వెలుగు కేవలం కంటితుడుపు చర్యేనని  చెబుతూ కంటి వెలుగు కేంద్రంలో ఏ ఒక్క కంటి డాక్టర్ కూడా లేరని చెప్పారు. సరోజిని దేవి కంటి ఆస్పత్రిలో సంవత్సరానికి 9 వేల ఆపరేషన్లు చేస్తున్నారని తెలిపారు. గతంలో నాలుగు ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని కోరడంతో పార్టీ నుండి తనను వెళ్లగొట్టారని ఆరోపించారు.

 ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా కంటికి సంబంధించిన ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ సంక్షేమం బిజెపి చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు. మోదీ  సారథ్యం దేశానికి అవసరమని తెలిపారు.