తొలి వన్డే ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్ పై భారత్ గెలుపు

న్యూజిలాండ్‌తో ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో భారత్‌ 12 పరుగుల తేడాతో  విజయం సాధించింది. ఛేదనలో భాగంగా న్యూజిలాండ్‌ జట్టు చివరి ఓవర్‌లో 20 పరుగులు చేయాల్సి ఉండగా  శార్దూల్‌ వేసిన తొలి బంతికే సిక్సర్‌ కొట్టిన బ్రాస్‌వెల్‌, రెండో బంతి వైడ్‌ పడడంతో 5 బంతుల్లో 13పరుగులు చేయాల్సి వచ్చింది.

ఆ దశలో శార్దూల్‌ ఓ అద్భుత యార్కర్‌ ద్వారా బ్రాస్‌వెల్‌ను ఎల్‌బీ చేసి భారత్‌ను గెలిపించాడు. దీంతో భారత్‌ 12 పరుగులు తేడాతో గెలిచి మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యతలో నిలిచింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాను ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (208) డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. కేవలం 145 బంతుల్లోనే డబుల్‌ సెంచరీ చేసిన శుభ్‌మన్‌  149బంతుల్లో 19ఫోర్లు, 9సిక్సర్లు కొట్టి కివీస్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

 ఫెర్గూసన్‌ వేసిన ఓవర్లో వరుసగా హ్యాట్రిక్‌ సిక్స్‌లు బాది డబుల్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శుభ్‌మన్‌ సిక్సర్లతోనే 50, 150, 200పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. చివరి ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన గిల్‌ 208 పరుగుల వద్ద ఔటయ్యాడు. రోహిత్‌(34), సూర్యకుమార్‌(31), హార్దిక్‌(28) బ్యాటింగ్‌లో రాణించారు.

కివీస్‌ బౌలర్లలో షిప్లే, మిచెలె రెండు వికెట్లు, ఫెర్గూసన్‌, టిక్నర్‌, సాంట్నర్‌కు తలా ఒక వికెట్‌ దక్కాయి. ఛేదనలో న్యూజిలాండ్‌ జట్టు 131పరుగులకే 6వికెట్లు కోల్పోయి ఓటమి కోరల్లో నిలిచింది. ఆ దశలో బ్రాస్‌వెల్‌(140), సాంట్నర్‌(57) కలిసి 7వ వికెట్‌కు 162పరుగుల జతచేసి ఆశలు రేపారు. చివరి వరకు పోరాడినా బ్రాస్‌వెల్‌ మ్యాచ్‌ను గెలిపించలేకపోయాడు. సిరాజ్‌కు నాలుగు, కుల్దీప్‌, శార్దూల్‌కు రెండేసి వికెట్లు దక్కాయి.

శుభ్‌మన్‌ గిల్‌ మరో రికార్డు
డబుల్‌ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా శుభ్‌మన్‌ గిల్‌ మరో రికార్డు సాధించాడు. శుభ్‌మన్‌ 23ఏళ్ల 123 రోజులు డబుల్‌ సెంచరీని చేస్తే.. ఆ తర్వాత ఇషాన్‌ కిషన్‌(24ఏళ్ల 145రోజులు), రోహిత్‌ శర్మ(26ఏళ్ల 186రోజులు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. అలాగే వన్డేల్లో డబుల్‌ సెంచరీ బాదిన ఐదో భారత క్రికెటర్‌గా శుభ్‌మన్‌ గిల్‌ మరో రికార్డు నెలకొల్పాడు.