15 రోజుల్లో 24 వేల మంది ఐటీ ఉద్యోగుల తొలగింపు

2023 ప్రపంచ వ్యాప్తంగా ఐటీ ఉదోగులకు అశనిపాతంగా మారింది. సంవత్సరం ప్రారంభంలోనే మొదటి పక్షం రోజులలో 24 మందికి పైగా ఉద్యోగులను 91 కంపెనీలు తొలగించాయి. ప్రపంచంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం దృష్ట్యా రానున్న రోజులలో పరిస్థితులు మరెంత అధ్వాన్నంగా మారుతాయో అని ఆందోళన చెందుతున్నారు.
 
అమేజాన్, సేల్స్‌ఫోర్స్, కాయిన్‌బేస్ తదితర కంపెనీలకు చెందిన దాదాపు 24,151 మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు లేఆఫ్స్ అనే వెబ్‌సైట్ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితులలో తమ ఉద్యోగుల సంఖ్యలో 20 శాతం మందిని తొలగించనున్నట్లు క్రిప్టో లెండింగ్ ఎక్స్‌చేంజ్ క్రిప్టో.కాం గత వారం ప్రకటించింది.భారతీయ కంపెనీలైన ఓలా ఇప్పటి వరకు 200 మంది ఉద్యోగులను తొలగించగా గత ఏడాది డిసెంబర్‌లో ఒకేసారి 17,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికి స్కిట్.ఎఐ అనే స్టార్టప్ పతాక శీర్షకకు ఎక్కింది. 2022లో మేటా, ట్విటర్, ఒరాకిల్, ఎన్‌విడియా, స్నాప్, ఊబర్, స్పాటిఫై, ఇంటెల్, సేల్స్‌ఫోర్స్‌కు చెందిన 1,53,110 మంది టెకీలు ఉద్యోగాలు కోల్పోయినట్లు వెబ్‌సైట్ తెలిపింది. ఒక్క గత ఏడాది నవంబర్ నెలలోనే 51,489 మంది ఉద్యోగాలు కోల్పోయారని తెలిపింది.

కాగా, 2023లో తన ఉద్యోగుల సంఖ్యను కుదించడానికి ఐటీ దిగ్గజం గూగుల్ కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది తన ఉద్యోగులలో 6 శాతం మందిపై గూగుల్ వేటు వేసే అవకాశం ఉంది. దీని ప్రకారం 11 వేల మది గూగుల్ ఉద్యోగులు ఈ ఏడాది లేఆఫ్‌కు గురయ్యే అవకాశం ఉంది.

ఈనెలాఖరులో విడుదలయ్యే టెక్ దిగ్గజాల త్రైమాసిక ఫలితాలపైనే అదరూ  ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీని తర్వాత టెక్ ఉద్యోగుల భవిష్యత్తు ఎలా ఉండనుందో తేలిపోనుంది.