‘దట్​ ఈజ్​ మోదీ’- ప్రధానిపై పాక్​ మీడియా ప్రశంసలు

పాకిస్థాన్​ ప్రభుత్వం, ఆ దేశ సైన్యం భారత్ లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ద్వారా దొంగదెబ్బ తీయడం కోసం నిత్యం కుట్రలు, కుతంత్రాలు పన్నుతూనే ఉన్నప్పటికీ  భారత్​పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న వారి సంఖ్య ఆ దేశంలో రోజురోజుకు పెరుగుతున్నట్టు కనిపిస్తోంది! ముఖ్యంగా ప్రధాని మరేంద్ర మోదీ పనితీరుపై దాయది దేశం నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.
 
మోదీ నేతృత్వంలోని భారత విదేశీ విధానాలపై గత నవంబర్​లో ఆ దేశం మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్వయంగా ప్రశంసల వర్షం కురిపించారు. విదేశీ విధానాల్లో భారత్​ స్వచ్ఛగా, స్వతంత్రంగా పనిచేస్తోందని పొగిడారు. అమెరికాను కాదని,రష్యా నుంచి చమురు కొనుగోలు చేయగలిగే స్థితికి భారత్ చేరిందని, ఇది చాలా గొప్ప విషయం అని స్పష్టం చేశారు. అందుకే భారత్ అభివృద్ధివైపు పరుగులు పెడుతోందని కూడా కితాబు ఇచ్చారు.
 
తాజాగా, పాకిస్తాన్ మీడియా సహితం భారత్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నది. ఆయన నేతృత్వంలో భారత్ దూసుకెళ్ళిపోతున్నట్లు కొనియాడుతున్నది. ప్రధాని  మోదీకి ప్రపంచ వ్యాప్తంగా లభిస్తున్న ఆదరణ, గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అతి తక్కువ సమయంలో ప్రపంచంలోనే అగ్రనేతగా ఎదిగిన మోదీకి ఎన్నో దేశాల మీడియాలు పట్టంగట్టాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి పాకిస్థాన్​ కూడా చేరింది!
 
భారత్​ను శత్రుదేశంగా భావించే పాక్​ సైతం మన ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించడం విశేషం. “ప్రపంచంపై తన ప్రభావాన్ని చూపించే స్థితికి భారత్​ను తీసుకెళ్లారు మోదీ,” అంటూ ప్రశంసించింది పాక్​కు చెందిన ప్రముఖ వార్తాసంస్థ ‘ది ఎక్స్​ప్రెస్​ ట్రిబ్యూన్​.’ ఈ మేరకు ఒపీనియన్​ కాలంలో ఓ భారీ వ్యాసాన్నే ప్రచురించింది.
 
ప్రధాని మోదీ నాయకత్వంలో  భారత దేశం అంతర్జాతీయంగా ఎలా ఎదుగుతోంది అన్న విషయాన్ని రాసుకొచ్చింది. భారత దేశ ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో.. భారత్ ఎంతో నైపుణ్యంగా వ్యవహరించి తన జీడీపీని 3 ట్రిలియన్​ డాలర్లకు పెంచుకుందని  పేర్కొంది. అభివృద్ధి పథంవైపు దూసుకెళుతోందని స్పష్టం చేసింది ది ఎక్స్​ప్రెస్​ ట్రిబ్యూన్.

పాకిస్థాన్​లోని ప్రముఖ రాజకీయ, భద్రత, రక్షణ నిపుణుడు షెహ్​జాద్​ చౌదరీ ఈ వ్యాసం రాశారు. భారత దేశ పురోగతి  ప్రపంచాన్ని అబ్బుపరుస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. మోదీ నేతృత్వంలోని భారత దేశం విదేశీ విధానాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుందని పేర్కొన్నారు.

“వ్యవసాయంలో ఎకరానికి భారత్ ఉత్పత్తి చేస్తున్న పంట ప్రపంచంలోనే మెరుగైన దశలో ఉంది. 1.4 బిలియన్​ జనాభా ఉన్నప్పటికీ భారత్ స్థిరంగా, క్రియాత్మకంగా ముందడుకు వేస్తోంది. భారత దేశ బ్రాండ్​ను మోదీ పెంచినంతంగా మరే ఇతర ప్రధాని కూడా పెంచలేదు,” అని ది ఎక్స్​ప్రెస్​ ట్రిబ్యూన్ వ్యాసంలో రాసుకొచ్చారు షెహ్​జాద్​ చౌదరీ.