లక్షద్వీప్‌ ఎంపీ మహ్మద్‌ ఫైజల్‌పై అనర్హత వేటు

లక్షద్వీప్‌ ఎంపీ మహ్మద్‌ ఫైజల్‌పై అనర్హత వేటు పడింది. హత్యాయత్నం కేసులో ముద్దాయిగా తేలడంతో కవరట్టీ సెషన్‌ కోర్టు ఆయనకు పదేండ్ల జైలుశిక్ష విధించింది. దీంతో ఆయనపై లోక్‌సభ స్పీకర్‌ అనర్హత వేటు వేశారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  జనవరి 11నే ఇది అమల్లోకి వచ్చిందని తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 102(I) (e) ప్రకారం నిర్ణయం తీసుకున్నామని అందులో పేర్కొన్నది. 
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన మహ్మద్ ఫైజల్‌ 2014 నుంచి ఎంపీగా ఉన్నారు.  2009 లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పీఎం సయీద్‌ అల్లుడైన్‌ పదాంత సాలిహ్‌పై కొంత మంది వ్యక్తులతో కలిసి ఫైజల్‌ హత్యాయత్నం చేశారు. పదునైన ఆయుధాలతో దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.
 
ఈ ఘటనపై నమోదైన కేసును కవరట్టీ సెషన్స్‌ కోర్టు విచారించింది. రాజకీయ కక్షలతోనే సాలిహ్‌ను హత్య చేయడానికి కుట్రపన్నారని, అయితే అందులో వారు విఫలమయ్యారని కోర్టు స్పష్టం చేసింది. నిందితులకు పదేండ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.లక్ష జరిమానా విధించింది.