వార‌ణాసి – డిబ్రూఘ‌ర్‌.. 3200 కిలోమీట‌ర్ల క్రూయిజ్ స‌ర్వీస్ 13న ప్రారంభం

ప్ర‌పంచంలోనే అత్యంత పొడుగైన క్రూయిజ్ స‌ర్వీసు ప్రారంభంకానున్న‌ది. యూపీలోని వార‌ణాసి నుంచి అస్సాంలోని డిబ్రూఘ‌ర్ వ‌ర‌కు ల‌గ్జ‌రీ క్రూయిజ్ సేవ‌లు అందుబాటులోకి రానున్నాయి. జ‌న‌వ‌రి 13వ తేదీన ఈ క్రూయిజ్‌ను ప్ర‌ధాని మోదీ ప్రారంభించ‌నున్నారు. మూడు డెక్కులు ఉన్న ఆ భారీ ప‌డ‌వ‌
సుమారు 50 రోజుల పాటు ప్ర‌యాణించ‌నున్న‌ది.

వార‌ణాసి నుంచి డిబ్రూఘ‌ర్ వ‌ర‌కు 3200 కిలోమీట‌ర్ల దూరం ఉంది. ఈ ప్ర‌యాణ స‌మ‌యంలో గంగా న‌దితో పాటు మ‌రో 27 ఉప‌న‌దుల మీదుగా ఆ క్రూయిజ్ సాగుతుంది. ప్ర‌పంచ వార‌స‌త్వ సంప‌ద‌కు చెందిన సుమారు 50 టూరిస్టు సైట్ల‌ను కూడా దారిలో సందర్శిస్తారు.

గంగా విలాస్ పేరుతో ల‌గ్జ‌రీ క్రూయిజ్‌ను న‌డిపించ‌నున్నారు. దీంట్లో 80 మంది ప్ర‌యాణికులు ఉంటారు. మొత్తం 18 సూట్లు ఉంటాయి. అన్ని సౌకర్యాల్ని ఇందులో పొందుప‌రిచారు. రెస్టారెంట్‌, స్పా, స‌న్‌డెక్ కూడా ఏర్పాటు చేశారు. అప్ప‌ర్ డెక్‌లో ఓ బార్ కూడా దీంట్లో ఉంటుంది. వాస్త‌వానికి ఈ ప్రాజెక్టు 2020లో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా వ‌ల్ల ఆల‌స్యం అయ్యింది.

వార‌ణాసి నుంచి గంగా విలాస్ క్రూయిజ్ ఎనిమిది రోజుల్లో పాట్నా చేరుకుంటుంది. బ‌క్స‌ర్, రామ్‌న‌గ‌ర్‌, ఘాజీపూర్ మీదుగా వెళ్తుంది. ఆ త‌ర్వాత మ‌రో 20 రోజుల్లో ప‌ఱ‌క్కా, ముర్షీదాబాద్ మీదుగా కోల్‌క‌తాకు వెళ్తుంది. అక్క‌డ నుంచి బంగ్లా రాజ‌ధాని ఢాకా వెళ్తుంది. ఇక బంగ్లా న‌దుల్లోనే 15 రోజుల ప్ర‌యాణం ఉంటుంది. మ‌ళ్లీ భారత్ లోకి గౌహ‌తి వ‌ద్ద ప్రవేశిస్తుంది. ఆ త‌ర్వాత చివ‌ర‌కు డిబ్రూఘ‌ర్ చేరుకుంటుంది.32 మంది స్విస్ టూరిస్టుల‌తో గంగా విలాస్ క్రూయిజ్ జ‌న‌వ‌రి 13న బ‌య‌లుదేర‌నున్న‌ది. ఒక్కొక్క ప‌ర్యాట‌కుడి నుంచి రూ. 13 ల‌క్ష‌లు వ‌సూలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.