ఆస్కార్స్ బరిలో ఆర్ఆర్ఆర్‌, కాంతారా, క‌శ్మీర్ ఫైల్స్‌, గంగూభాయ్

ఆస్కార్ రేసులో భారత సినిమాలు పోటీ పడనున్నాయి. ఈ యేటి ఆస్కార్స్ రిమైండ‌ర్ రేసులో ఉన్న‌ 301 చిత్రాల జాబితాను రిలీజ్ చేసింది. దాంట్లో ఐదు భారతీయ చిత్రాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్, గంగూభాయ్ క‌తియావాడి, ద క‌శ్మీర్ ఫైల్స్‌, కాంతారా చిత్రాలు కూడా ఆస్కార్స్ లిస్టులో ఉన్న‌ట్లు అకాడ‌మీ వెల్ల‌డించింది.

మరాఠీ చిత్రాలు ‘మీ వసంతరావ్’, ‘తుజ్యా సతీ కహీ హాయ్’, ఆర్ మాధవన్ ‘రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్’, ఇరవిన్ నిజాల్, కన్నడ మూవీ ‘విక్రాంత్ రోణ’ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. డాక్యుమెంటరీల విషయానికొస్తే.. షౌనక్ సేన్, కార్తికీ గోన్సాల్వ్‌స్ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’, ‘ఆల్ దట్ బ్రీత్స్’ కూడా జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి ఈ జాబితాలో చోటు దక్కడంపై సంతోషం వ్యక్తం చేసిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి.. అన్ని చిత్రాలకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘భారతీయ సినిమాకు ఇది గొప్ప సంవత్సరం’ అని పేర్కొన్నారు. పల్లవిజోషి, మిథున్‌చక్రవర్తి, అనుపమ్‌ ఖేర్ ఉత్తమ నటుల కేటగిరీలో షార్ట్ లిస్ట్ కావడం పట్ల.. ఇది ప్రారంభం మాత్రమే, వారందరినీ ఆశీర్వదించండి’ అని ట్వీట్ చేశాడు.

గతేడాది విడుదలై సంచలనం సృష్టించిన కన్నడ సినిమా కాంతార.. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోయింది. కాగా ఈ సినిమా రెండు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లకు అర్హత సాధించినట్టు ఆ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ తెలిపింది. ‘ఆస్కార్ 2023’కి ‘కాంతారా’ సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు విభాగాల్లో టాప్ 15 జాబితాలో ఈ చిత్రం నిలిచింది. మరో కన్నడ చిత్రం ‘విక్రాంత్‌ రోణ’ కూడా ఆస్కార్‌ నామినేషన్ల బరిలో నిలిచింది.

95వ ఆస్కార్‌ అవార్డ్స్‌కు నామినేట్‌ అయిన చిత్రాల జాబితాను 24న ప్రకటిస్తారు. మార్చి 12న ఆస్కార్‌ వేడుక జరగనుంది.  అయితే రిమైండర్ జాబితాలో అధికారికంగా వివిధ విభాగాల్లో పోటీపడుతున్న చిత్రాలు తుది నామినేషన్స్‌లో ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. అయినప్పటికీ నామినేషన్లకు ముందే ఆస్కార్ షార్ట్ లిస్టులో భారతదేశం నుంచి నాలుగు చిత్రాలు చేరడం బహుశా ఇదే మొదటిసారి.

‘ఛెల్లో షో, ఆర్‌ఆర్‌ఆర్, ఆల్ దట్ బ్రీత్స్, ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఇప్పటికే నాలుగు కేటగిరీల కోసం ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌లో ఉన్నాయి. ఛెల్లో షో ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్ర విభాగంలో పోటీపడుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ నుంచి నాటు నాటు సాంగ్ (బెస్ట్ ఒరిజినల్ స్కోర్) విభాగంలో జాబితా చేయబడింది.