ఫిబ్రవరి 13 నుండి బెంగళూరులో ఆసియాలోనే అతిపెద్ద ఏరో షో

ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు కర్ణాటకలోని బెంగళూరులో జరగనున్న ఆసియాలోనే అతిపెద్ద, 14వ ఏరో షో – ఏరో ఇండియా-2023కు హాజరు కావాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులను రక్షణ మంత్రి  రాజ్ నాథ్ సింగ్   ఆహ్వానించారు. తమ తమ ఈ డిఫెన్స్, ఏరోస్పేస్ కంపెనీలను గ్లోబల్ ఈవెంట్ కు హాజరయ్యేలా ప్రోత్సహించాలని ఆయన కోరారు.
న్యూఢిల్లీలో ఏరో ఇండియా 2023కు సంబంధించి జరిగిన రాయబారుల రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించారు. రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ నిర్వహించిన ఈ రీచ్ అవుట్ కార్యక్రమంలో 80కి పైగా దేశాల రాయబారులు, హై కమిషనర్లు, చార్జీ డి అఫైర్స్ , డిఫెన్స్ అటాచీలు పాల్గొన్నారు.

ఏరోస్పేస్ పరిశ్రమతో సహా భారతీయ విమానయాన-రక్షణ పరిశ్రమకు తన ఉత్పత్తులు, సాంకేతికతలు ,పరిష్కారాలను జాతీయ స్థాయి విధాన నిర్ణేతలకు ప్రదర్శించడానికి అవకాశాన్ని అందించే ప్రధాన గ్లోబల్ ఏవియేషన్ ట్రేడ్ ఫెయిర్ గా ఏరో ఇండియాను రక్షణ మంత్రి అభివర్ణించారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో భారత వైమానిక దళం విమాన ప్రదర్శనలతో పాటు ప్రధాన ఏరోస్పేస్ , డిఫెన్స్ ట్రేడ్ ఎక్స్పోజిషన్ సమ్మేళనం ఆవిష్కృతం అవుతుంది.

రక్షణ, ఏరోస్పేస్ పరిశ్రమల్లోని ప్రధాన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రక్షణ మేధో సంస్థలు, రక్షణ సంబంధిత సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. విమానయాన రంగంలో సమాచారం, ఆలోచనలు, కొత్త సాంకేతిక పరిణామాల మార్పిడికి ఏరో ఇండియా ఒక ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు.

 ఏరో ఇండియా – 2021 విజయాన్ని రాజ్ నాథ్ సింగ్ గుర్తుచేస్తూ, గత ఎడిషన్ లో 600 మందికి పైగా ఎగ్జిబిటర్లు నేరుగా, మరో 108 మంది వర్చువల్ గా హాజరయ్యారని, ఈ కార్యక్రమంలో 63 దేశాలు పాల్గొన్నాయని, సుమారు 3,000 బిజినెస్ -2-బిజినెస్ సమావేశాలు జరిగాయని ఆయన తెలిపారు.

1,340 మందికి పైగా ఎగ్జిబిటర్లు, వ్యాపార సంస్థలు, పెట్టుబడిదారులు, స్టార్టప్ లు, ఎంఎస్ ఎంఈలు, సాయుధ దళాలు, అనేక దేశాల ప్రతినిధులు పాల్గొన్న డిఫెన్స్ ఎక్స్ పో 2022 భారీ విజయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. 451 అవగాహన ఒప్పందాలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ఒప్పందాలు, ఉత్పత్తుల ఆవిష్కరణలు, దేశీయ వ్యాపారాలకు రూ.1.5 లక్షల కోట్ల విలువైన ఆర్డర్లు డిఫెన్స్ ఎక్స్ పో విజయానికి నిదర్శనమని ఆయన చెప్పారు.

ఏరో ఇండియా-2023 లో ఎగ్జిబిటర్లు , మిత్ర దేశాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని రక్షణ మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. “ఇప్పటివరకు ఏర్పడిన భాగస్వామ్యాలకు మద్దతు ఇవ్వడానికి , భవిష్యత్తు వృద్ధి కోసం కొత్త సంబంధాలను ఏర్పరచడానికి మేము కట్టుబడి ఉన్నాము” అని చెప్పారు.

‘మేక్ ఇన్ ఇండియా’ కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కేవలం భారతదేశానికి మాత్రమే ఉద్దేశించినవి కాదని స్పష్టం చేస్తూ, ‘‘మన స్వావలంబన చొరవ భాగస్వామ్య దేశాలతో రక్షణ సంబంధాల కొత్త నమూనాకు నాంది. ప్రపంచ రక్షణ పరిశ్రమ దిగ్గజాలతో భాగస్వామ్యాలు జరుగుతున్నాయి‘‘ అని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.