బ్రిటన్‌లో సమ్మెకు సిద్దమైన రైలు కార్మికులు

మెరుగైన వేతనాలు కోరుతూ బ్రిటన్‌లో రైలు కార్మికులు సమ్మె చేపట్టారు. నూతన సంవత్సర వేడుకల కోసం సెలవులపై వెళ్లిన వేలాది మంది తిరిగి స్వస్థలాలకు చేరుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రైలు సర్వీసులు తగ్గించబడ్డాయని, ప్రయాణికులు కనీసం ఆదివారం వరకు వేచిచూడాలని నెట్‌వర్క్‌ రైల్‌ సూచించింది.

రైళ్లన్నీ రద్దీగా ఉండవచ్చని, కొన్ని ప్రాంతాల్లో సర్వీసులు ఉండకపోవచ్చని… దీంతో ప్రయాణికులు రైల్వేస్టేషన్‌లకు చేరుకుని ఇబ్బందులకు గురికావద్దని హెచ్చరించింది. 40 వేల మంది సభ్యులు కలిగిన రైల్‌, మారిటైమ్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ యూనియన్‌ (ఆర్‌ఎంటి) నాలుగు రోజుల పాటు సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటించింది.

పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాలు పెంచాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే యూనియన్లు, రైలు కంపెనీల మధ్య ఒప్పందం జరగకుండా ప్రభుత్వం అడ్డుకుందని ఆర్‌ఎంటి అధ్యక్షుడు మికీ లించ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనపెంపు సాధ్యం కాదని వెస్ట్‌మినిస్టర్‌ కార్యాలయం పేర్కొంటోంది. ద్రవ్యోల్బణం, వేతనపెంపుల చుట్టూ తిరుగుతూ ఉంటుందని పేర్కొంది. చర్చలు ఫలవంతమైతేనే సమస్య పరిష్కారమవుతుందని, సమ్మెతో కాదని ట్రాన్స్‌పోర్ట్‌ మినిస్టర్‌ మార్క్‌ హార్పర్‌ పేర్కొన్నారు. అయితే తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించడం లేదని, పరిష్కారం తెలిసినప్పటికీ ప్రభుత్వం అడ్డుకుంటోందని మికీ లించ్‌ పేర్కొన్నారు.

ప్రస్తుతం బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం 41 సంవత్సరాల గరిష్ట స్థాయి 11.1 శాతానికి చేరింది. ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు పెరగకపోవడంతో దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మెకు దిగుతున్నారు. ఇప్పటికే గతేడాది డిసెంబర్‌ నుండి నర్సులు, వైమానిక సిబ్బంది, అంబులెన్స్‌ , బస్సు డ్రైవర్లు, సరిహద్దు నియంత్రణ అధికారులు, పోస్టల్‌ ఉద్యోగులు సమ్మె చేపడుతున్న సంగతి తెలిసిందే.