వరుసగా నాలుగు రోజుల వ్యవధిలో చంద్రబాబు ప్రసంగించిన రెండు సభలలో జరిగిన తొక్కిసలాటలలో 11 మంది మృతి చెందడంతో రాజకీయ పార్టీలు ముందు అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాలలో ర్యాలీలు, సభలు జరపరాదని ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు విధించిన మరుసటి రోజుననే చంద్రబాబు నాయుడు మూడురోజుల కుప్పం నియోజకవర్గ పర్యటనకు వెళ్లడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చంద్రబాబు సభలకు అనుమతి నిరాకరించిన పోలీసులు ఆయన ప్రచార రధం డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. దానితో ఆగ్రహం చెందిన చంద్రబాబు పాదయాత్ర చేపట్టారు.
ఇక్కడ సభకు అనుమతి లేదు వెళ్లిపోవాలని డిఎస్పీ చంద్రబాబుకు సూచించగా..ఇక్కడి నుంచి కదిలేది లేదు అనుమతివ్వాలని బాబు పట్టుబట్టారు. డిఎస్పీ ఇచ్చిన నోటీసులను తీసుకోడానికి కూడా చంద్రబాబు నిరాకరించారు. అనుమతి ఇవ్వకపోవడంతో చంద్రబాబు తన కారులోనే కూర్చొని ఆందోళన తెలిపారు. చివరకు రోడ్డు షోకు అనుమతి ఇవ్వకపోవడంతో పెద్దూరు నుంచి చంద్రబాబు పాదయాత్రగా బయలుదేరారు.
ప్రతి పక్షాల సభలు ప్రభుత్వ దయ, దాక్షిణ్యాలతో జరిగేలా ప్రభుత్వం జీవో తెచ్చిందని చంద్రబాబు మండిపడ్డాయిరు. సీఏం వైఎస్.జగన్మోహన్ రెడ్డి మాత్రం రాజమహేంద్రవరంలో రోడ్‌షో, సభ నిర్వహించారని విమర్శించారు. అధికారపార్టీలకు, ప్రతిపక్షాలకు నిబంధనల్లో తేడాలెందుకని ప్రశ్నించారు. తన పర్యటనపై నెల రోజుల ముందే డీజీపీకి లేఖ రాశానని చెప్పారు.
ప్రభుత్వం, పోలీసుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి టిడిపి సభలను పెట్టుకోవాలా? అని ఆయన ప్రశ్నించారు.ఈ సందర్భంగా చంద్రబాబు కాన్వాయ్ వద్దకు చేరుకున్న టిడిపి శ్రేణులు కుప్పం చంద్రబాబు అడ్డా అంటూ నినాదాలు చేశారు. దీంతో టిడిపి కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలో పలువురు కార్యకర్తలు గాయపడగా, కొందరు మహిళలు స్పృహతప్పి పడిపోయారు.
తన సొంత ఇళ్ళు ఉన్న కుప్పం నియోజకవర్గంలోని ప్రజలను కలవకుండా పోలీసులు అడ్డుకోవడం కూడదని పేర్కొంటూ పోలీసులు పద్దతి ప్రకారం విధుల్లో వ్యవహరించాలని చంద్రబాబు హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంటుందనే విషయాన్ని గుర్తించుకోవాలని హితవు చెప్పారు. తన రోడ్‌షోకు, సభకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదో లిఖత పూర్వకంగా రాసివ్వాలని పోలీసులను ఆయన డిమాండ్ చేశారు.
జగన్ బాబాయిని ఎవరు చంపారో డిజిపి కనిపెట్టాలని సవాల్ విసిరారు. జగన్ లాంటి సిఎంను తన జీవితంలో తొలిసారి చూస్తున్నానని ఆయన ధ్వజమెత్తారు. సిఎం జగన్ సభలకు స్కూళ్ళకు, కాలేజీలకు సెలవులు ఇచ్చి, వాటి బస్సుల్లో జనాలను తీసుకొచ్చేవారని ఆయన ఎద్దేవా చేశారు. పెన్షన్ కట్ చేస్తామని బెదిరించి మహిళలను బలవంతంగా తరలించారని చంద్రబాబు విమర్శించారు.
More Stories
కర్నూలు బస్సు ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
కర్నూలు జిల్లాలో బస్సుకు దగ్ధంలో 19 మంది సజీవ దహనం
అమరావతికి ప్రపంచ బ్యాంకు మరో రూ 1700 కోట్లు