ఆర్థిక మాంద్యంలోకి మూడోవంతు ప్రపంచం

అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ చీఫ్ క్రిస్టాలినా జార్జీవా కీలక వ్యాఖ్యలు చేశారు. మూడో వంతు ప్రపంచ దేశాలు ఈ ఏడాది ఆర్థిక మాంద్యంలోకి జారుకునే ముప్పు ఉందని హెచ్చరించారు. అమెరికా, చైనా,  ఐరోపా దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశాలు ఉన్నందున.. కిందటి ఏడాది కంటే ఈ సంవత్సరం  సంక్లిష్టంగా ఉండొచ్చని తెలిపారు.

 ‘‘కొన్ని దేశాలు ఆర్థిక మాంద్యంలో లేనప్పటికీ.. అక్కడ నివసించే కోట్లాది మంది ప్రజలు ఆర్థిక మాంద్యపు ప్రభావాన్ని చవిచూసే చాన్స్ ఉంటుంది’’ అని ఐఎంఎఫ్ చీఫ్ కామెంట్ చేశారు.  పది నెలలుగా కొనసాగుతున్న ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలియని సమయంలో ఈ ఆర్థిక మాంద్యం వస్తోందన్నారు. అత్యధిక వడ్డీ రేట్లు, చైనాలో కరోనా సంక్రమణలు దీనికి మరింత ఆజ్యం పోస్తున్నాయని తెలిపారు.

‘ప్రపంచంలోని మూడింట ఒక వంతు ఆర్థిక మాంద్యంలో చిక్కుకోనున్నది’ అని జార్జివా ఆ న్యూస్ ప్రోగ్రామ్‌లో అన్నారు. అమెరికా, యూరొప్ యూనియన్, చైనా ఆర్థిక వ్యవస్థలు మందకొడి కావడంతో 2023వ సంవత్సరం మరింత దుర్భరంగా ఉండనున్నదని క్రిస్టాలినా జార్జివా తేల్చి చెప్పారు.  ‘‘ఈ ఏడాది వచ్చే కొన్ని నెలల పాటు చైనాకు కష్టకాలమే. చైనా వృద్ధి రేటు మందగించే అవకాశం ఉంది. ఈ ప్రభావం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలపై కూడా పడుతుంది’’ అని ఆమె విశ్లేషించారు.

కాగా, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను ఐఎంఎఫ్  ఏటా విడుదల చేస్తుంటుంది. 2021లో 6 శాతం, 2022లో 3.2 శాతం వృద్ధిరేటులను అంచనా వేసిన ఐఎంఎఫ్.. 2023 సంవత్సరానికి కేవలం 2.7 శాతం వృద్ధిరేటే సాధ్యమవుతుందని అభిప్రాయపడింది. ఈ అంచనాలకు ఊతమిచ్చేలా ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జీవా తాజా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.