బైరి నరేష్ పై పీడి యక్ట్ నమోదు చేయాల్సిందే

అయ్యప్ప స్వామిని, హిందూ దేవతలను అసభ్యంగా దూషించిన బైరీ నరేష్ అనే హిందూ ద్రోహి పై పిడి యాక్ట్ నమోదు చేయాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్, అయ్యప్ప స్వామి సేవాసమితుల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనల కారణంగా దిగివచ్చిన ప్రభుత్వం, నరేష్ పై తూతు మంత్రంగా కేసులు పెట్టేందుకు ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు. 
 
దేవి దేవతలను దూషించిన వీడియోలు స్పష్టంగా ఉన్నాయి కాబట్టి  వెంటనే పిడి నమోదు చేసి కఠినంగా శిక్షించాలని పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. పరిషత్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సురేందర్ రెడ్డి, పండరినాథ్, బజరంగ్దళ్ రాష్ట్ర సంయోజక్ శివరాములు ఓ ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ హిందూ దేవుళ్లను దూషించిన వారికి వత్తాసు పలికితే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
 
 రాష్ట్రవ్యాప్తంగా హిందువులందరూ సంఘటితంగా ఉద్యమించడం శుభ పరిణామం అని పేర్కొన్నారు. హిందూ ద్రోహులకు తెలంగాణలో చోటు లేదని వారు స్పష్టం చేశారు. నాస్తికత్వం పేరుతో హిందుత్వాన్ని దూషిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. 
ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు  ఈ విషయంపై స్పందించకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు.
పరమ పవిత్రమైన అయ్యప్ప మాల ధారణ గల భక్తులు ఉద్యమిస్తున్న కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.  వెంటనే బైరి నరేష్, అతని అనుచరులపై పిడి ఆక్టర్ నమోదు చేసి కఠినంగా శిక్షించాలని  వారు స్పష్టం  చేశారు. ఈ  విషయంలో ప్రభుత్వం తాత్సారం వహిస్తే ప్రగతి భవన్ ముట్టడికి కూడా వెనకాడమని పరిషత్ నేతలు హెచ్చరించారు.
24 గంటల్లో రిమాండ్ కు పంపాము 

 కాగా, అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్, డోలు హన్మంతులను 24 గంటలలో అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు వికారాబాద్ ఎస్పీ ఎన్ కోటిరెడ్డి తెలిపారు.  ఈ నెల 19 వ తారీఖున కొడంగల్ మండలం రావులపల్లి గ్రామంలో జరిగిన సమావేశంలో అయ్యప్ప స్వామి పుట్టుకపై అనుచిత వాఖ్యలు చేసిన బైరి నరేశ్, డోలు హన్మంతులపై కొడంగల్ పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదు చేసి శనివారం నాడు రిమాండ్ కు పంపినట్లు చెప్పారు. 
 
 అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు సబబు కాదని, చట్ట వ్యతిరేకం అని స్పష్టం చేస్తూ ఎవరైనా ఇతరుల మనోభావాలకు, విశ్వాసాలకు ఇబ్బంధి కలిగే విధంగా మాట్లాడినా, మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా లేదా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొంటామని ఆయన హెచ్చరించారు. 
 
బైరి నరేశ్ ఇంతకుముందు కూడా ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందున వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్, కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీస్ స్టేషన్ లలో నమోదైన కేసులలో నిందితునిగా ఉన్నాడని ఆయన చెప్పారు. కావున జిల్లాలో ఎక్కడైనా సమావేశాలు నిర్వహించేటప్పుడు నిర్వాహకులు ఇలాంటివారిని ప్రోత్సహించకూడదని కోటిరెడ్డి హితవు చెప్పారు. 
పరిగి జైలుకు తరలింపు 
కొడంగల్‌ పోలీసులు శనివారం బైరి నరేశ్‌తో పాటు అంబేడ్కర్‌ జాతర కార్యక్రమ నిర్వాహకుడు డోలు హన్మంతును కూడా అరెస్టు చేసి  కొడంగల్‌ మున్సిఫ్‌ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరచగా.. జడ్జి 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో పోలీసులు వీరిద్దరిని పరిగి సబ్‌-జైలుకు తరలించారు.  అప్పటికే అక్కడ అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో ఆందోళన చేస్తుండడంతో.. బైరి నరేశ్‌, హన్మంతు పోలీసు వాహనం దిగగానే.. జైలులోకి పరుగులు తీశారు. 
 
నిందితులిద్దరినీ పోలీసులు పరిగి సబ్‌-జైలుకు తీసుకురాగా అక్కడే ఆందోళన చేస్తున్న అయ్యప్ప భక్తులు వారిని తమకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ‘‘వారిద్దరిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించాలి. ఆ రోజు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యులందరిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’’ అని డిమాండ్‌ చేశారు.