2024 ఎన్నికలకు సెమీ ఫైనల్స్… 2023లో 9 అసెంబ్లీ ఎన్నికలు

వరుసగా మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకు రాగలరని భావిస్తున్న కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికల  కంటే ముందు ఈ ఏడాది 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకనే ఈ ఎన్నికలను సెమి ఫైనల్స్ గా అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. 

తెలంగాణతో పాటు కర్నాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, త్రిపుర, మేఘాలయా, నాగాలాండ్, మిజోరాంలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తొమ్మిది రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్‌లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఒకవేళ ఇక్కడ కూడా ఎన్నికలు జరిగితే.. మొత్తం 11 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈసారి ఎన్నికలు జరిగినట్లవుతుంది. 

2024 లోక్‌సభ ఎన్నికల్లోఉపొందడానికి ఈ ఎన్నికలు కీలకం కాగలవు.  ఫిబ్రవరి -మార్చిలో ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయా, నాగాలాండ్‌లో ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత మేలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు. నవంబరులో మిజోరం ఎన్నికలు జరగనున్నాయి.  అనంతరం రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహిస్తారు.

2024 మేలో లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి.  ఈ ఏడాదిలో మొదట త్రిపుర, మేఘాలయా, నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహిస్తారు. ఇందులో త్రిపురపైనే అందరి దృష్టి ఉంది. ఎందుకంటే 2018 ఎన్నికల్లో సిపిఎం కోటలను బద్దలు కొట్టి తొలిసారి అక్కడ బీజేపీ  ప్రభుత్వం ఏర్పాటయింది. తిరిగి మరోసారి గెలుపు బీజేపీకి ప్రతిష్టాకరంగా మారింది.

నాగాలాండ్‌లో బీజేపీ మిత్రపక్షం నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ  అధికారంలో ఉంది. మేఘాలయాలో నేషనల్ పీపుల్స్ పార్టీ  అధికారంలో ఉంది. ఇది కూడా బీజేపీ మిత్రపక్షమే. ఇక కర్ణాటకలో మాత్రం బీజేపీ బలంగా ఉంది. ఈసారి కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ధీమాలో ఉంది. దక్షిణాదిన కర్ణాటకతో పాటు తెలంగాణాలో కూడా అధికారంలోకి రావాలని బిజెపి పట్టుదలతో ఉంది.

ఇక్కడ గత ఎన్నికలలో టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ద్విముఖ పోటీ జరుగగా, ఇప్పుడు బీజేపీ బలోపేతం కావడంతో త్రిముఖపోటీగా మారనున్నది. మరోవంక, రెండు దశాబ్దాల పాటు ప్రాంతీయవాదంతో రాజకీయాలు చేస్తూ వచ్చిన టిఆర్ఎస్ ఇప్పుడు బిఆర్ఎస్ గా మారడంతో మొత్తం రాజకీయ చిత్రపటంలోనే మార్పులు వచ్చాయి. 

ఇక రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో మళ్లీ గెలవాలని ఆ పార్టీ భావిస్తోంది. కానీ రాజస్థాన్‌లో మాత్రం పరిస్థితులు ఆశాజనంగా లేవు. సీఎం అశోక్ గహ్లోత్‌కు వ్యతిరేకంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేస్తున్నారు. సచిన్ పైలట్ వర్గం ఆయనపై తీవ్ర అసంతృప్తితో ఉంది. 

అశోక్ గహ్లోత్ వర్సెస్ సచిన్ పైలట్ వ్యవహారం కాంగ్రెస్‌కు నష్టం చేకూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు రాజస్థాన్‌లో ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ప్రభుత్వం మారుతుంది. ఈ నేపథ్యంలో ఈసారి తామే గెలుస్తామని బీజేపీ ధీమాగా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లోనూ కాంగ్రెస్‌ను ఓడించి  అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. నవంబరులో మిజోరంలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉంది.