
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీతో ఫోన్లో సంభాషించారు. ఈ సందర్భంగా జి20కి భారత్ అధ్యక్షతపై ఉక్రెయిన్ అధ్యక్షుడు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి స్పందిస్తూ జి20కి అధ్యక్షత సమయంలో భారత్ ప్రాధాన్యాల గురించి వివరించారు.
ఇందులో భాగంగా ఆహార, ఇంధన భద్రత వంటి అంశాల్లో వర్ధమాన దేశాల గళానికి ప్రాముఖ్యం ఇస్తామని ఆయన తెలిపారు. ద్వైపాక్షిక సహకారం బలోపేతానికిగల అవకాశాలై దేశాధినేతలిద్దరూ చర్చించారు. ఈ ఏడాది ఆరంభంలో ఉక్రెయిన్ నుంచి స్వదేశం వచ్చిన భారత విద్యార్థుల చదువు కొనసాగింపునకు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రధానమంత్రి ఉక్రెయిన్ అధికారవర్గాలను కోరారు.
ఉక్రెయిన్‌లో ప్రస్తుత ఘర్షణకు సంబంధించి వారిద్దరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. శత్రుత్వాలను తక్షణం విడనాడాలన్న తన పిలుపును ప్రధాని మోదీ గట్టిగా పునరుద్ఘాటించారు. అలాగే విభేదాలకు శాశ్వత పరిష్కారం అన్వేషించే దిశగా ఉభయ పక్షాలు మళ్లీ చర్చలు, దౌత్య మార్గం అనుసరించాలని కోరారు.
ఏదేమైనప్పటికీ శాంతి ప్రయత్నాలకు భారత్ సదా మద్దతిస్తుందని కూడా ప్రధాని స్పష్టం చేశారు. బాధిత ఉక్రెయిన్ పౌరులకు మానవతా సహాయం కొనసాగించడంలో భారత్ నిబద్ధతకు హామీ ఇచ్చారు.
తన ’10 పాయింట్ల శాంతి ప్రణాళిక’కు మద్దతు ఇవ్వాలని మోడీని జెలెన్‌స్కీ కోరారు. ప్రస్తుత యుద్ధ సమయంలో భారత్ అందిస్తున్న సహాయానికి జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలిపారు. ఇద్దరు నేతలూ ఫోన్ ద్వారా సంభాషించుకోవడం ఈ ఏడాదిలో ఇది నాలుగోసారి. ఇటీవల జెలెన్‌స్కీ అమెరికా పర్యటన తరువాత ఇదే మొదటిసారి.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్గా అర్షదీప్
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు