సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిని సందర్శించిన మాండవియా

కరోనా వైద్య నిర్వహణ కోసం ఆసుపత్రి మౌలిక సదుపాయాల సంసిద్ధతను నిర్ధారించడానికి చేపట్టిన కసరత్తును సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా మంగళవారం న్యూఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిని సందర్శించారు.
ఆయన  సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ , వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజీ విభాగాల అధిపతులు, సిబ్బందితో అనధికారిక సమావేశంలో పాల్గొన్నారు. వివిధ విభాగాల అధిపతులు, వైద్యులు, నర్సులు, భద్రత, పారిశుద్ధ్య సేవల అధిపతులతో సుమారు గంటపాటు గడిపారు. 
 నాణ్యమైన ఆసుపత్రి నిర్వహణ, వైద్య విధానాలు,  నియంత్రణ చర్యలు, పారిశుద్ధ్య ప్రక్రియలు, ఆరోగ్య సంరక్షణ సదుపాయం రోగుల ఆధారిత అధిక నాణ్యతపై వారిచ్చిన పలు సూచనలను ఓపికగా విన్నారు.  మహమ్మారి సమయంలో నిరంతరం సేవలను అందించడానికి పనిచేసిన వారి అనుభవాన్ని  పంచుకున్నారు.
ప్రతి వారం తమ బృందాలను కలవాలని, అన్ని విభాగాలు సందర్శనను చేపట్టాలని, అత్యుత్తమ ఫలితాలను నిర్ధారించడానికి వారి పనితీరును అంచనా వేయాలని డాక్టర్ మాండవ్య విభాగాధిపతులకు సూచించారు. కరోనా మహమ్మారి సమయంలో వైద్యులు ఆదర్శప్రాయంగా పనిచేసినందుకు ఆయన ప్రశంసించారు.
 
ప్రతి ఒక్కరూ కరోనా వ్యాధి కి తగిన ఆరోగ్య ప్రవర్తనను అనుసరించాలని కోరారు. అప్రమత్తంగా ఉండాలని, ధృవీకరించని సమాచారాన్ని పంచుకోవడం మానుకోవాలని,  ఉన్నత స్థాయి సంసిద్ధతను నిర్ధారించుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
 
 “ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి.  భారతదేశంలో కూడా కేసులు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల పరికరాలు, ప్రక్రియలు మరియు మానవ వనరుల పరంగా మొత్తం కోవిడ్ వైద్య కార్యాచరణ సంసిద్ధత స్థితిలో ఉండటం చాలా ముఖ్యం” అని ఆయన పేర్కొన్నారు.
 
 “నేను ఇటీవల రాష్ట్ర ఆరోగ్య మంత్రులతో కరోనా పరిస్థితి, కరోనా నివారణ, నిర్వహణ సంసిద్ధతను సమీక్షించాను. కరోనా వైద్య నిర్వహణ కోసం సంసిద్ధతను సమీక్షించడానికి ఈ రోజు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌లు నిర్వహించబడుతున్నాయి, దీని కోసం ఆసుపత్రులలో సంసిద్ధత చాలా ముఖ్యమైనది” అని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి చెప్పారు.