ఆఫ్ఘన్ లో మహిళలపై ఆంక్షల పట్ల సర్వత్రా నిరసనలు 

అఫ్గానిస్థాన్‌లో మహిళలపై తాలిబన్ పాలకులు విధిస్తున్న ఆంక్షల పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అమ్మాయిలకు యూనివర్సిటీ విద్యను నిషేధం విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ  అమ్మాయిలకు మద్దతుగా దేశవ్యాప్తంగా పురుష విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. అమ్మాయిలను వర్సిటీల్లోకి అనుమతించే వరకు క్లాసులకు హాజరయ్యేది లేదని స్పష్టం చేశారు.
మహిళలకు ఉన్నత విద్యను దూరంచేసేలా తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మహిళలను తరగతులకు వచ్చేవారకు తమ ఈ నిరసన కొనసాగుతుందని ముజాముల్‌ అనే విద్యార్థి స్పష్టం చేశాడు. అప్పటివరకు తాము చదువుకునేది లేదని చెప్పాడు.
తమ సోదరీమణులకు యూనివర్సిటీ విద్యను బంద్‌ చేశారు. అలాగైతే తాము కూడా వర్సిటీలకు వెళ్లేది లేదని తెలిపాడు. అమ్మాలకు వర్సిటీ విద్యపై తాలిబన్‌ ప్రభుత్వం గతవారం నిషేధం విధించిన విషయం తెలిసిందే. కాగా, మహిళలకు ఉన్నత విద్యాలయాల్లో ప్రవేశం అక్కర్లేదని విద్యాశాఖ మంత్రి నిదా మహ్మద్ నదిం పేర్కొన్నారు.
యూనివర్సిటీలోకి అనుమతి ఇవ్వడం వల్ల.. ఆడ, మగ ఒకే దగ్గరికి వస్తున్నారని, ఇది ఇస్లాం సూత్రాలకు విరుద్ధంగా ఉండడంతో దీన్ని నిరోధించడానికే ఈ కొత్త ఆదేశాలని ఆయన తెలిపారు. తదుపరి నోటీసులు వచ్చే వరకు ఇది అమలులో ఉంటుందని ఆయన చెప్పారు.
 
సేవలు నిలిపివేసిన ఎన్‌జిఒ సంస్థలు

ఇలా ఉండగా, మహిళల విద్య, ఉద్యోగాలకు సంబంధించి తాజాగా తాలిబన్లు ఆంక్షలు పెట్టడంతో సేవలు నిలిపివేస్తున్నట్లు మూడు ఎన్‌జిఒ సంస్థలు ఆదివారం ప్రకటించాయి. అంతర్జాతీయ, స్థానిక ప్రభుత్వేతర సంస్థల్లో మహిళలు పని చేయకుండా నిషేధం విధించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. 

తాలిబన్ పాలకులు ఇటీవల తమ విధానాలలో భాగంగా ప్రభుత్వేతర సహాయక సంస్థలు (ఎన్‌జిఒ)లో మహిళలు ఉద్యోగాలలో చేరరాదని ఆదేశించింది. ప్రత్యేకించి విదేశీ ఎన్‌జిఒలలో ఉద్యోగినులుగా చేరితే అప్ఘన్ మహిళలకు శిక్షలు తప్పవని హెచ్చరించింది.  సేవ్‌ ది చిల్డ్రన్‌, నార్వేజియన్‌ రెఫ్యూజీ కౌన్సిల్‌, కేర్‌ సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ మహిళలు తమ సంస్థల్లో పనిచేయకుండా పిల్లలు, మహిళలకు సేవలందించలేమని తెలిపారు. ఈ గ్రూపులో దేశంలో 468 మంది మహిళా సిబ్బంది ఉన్నారని తెలిపారు.

”అంకితభావంతో కూడిన మహిళా సిబ్బంది లేకుండా మేము పని చేయలేం, లక్షల మంది ప్రాణాలను కాపాడటానికి, సేవలందించేందుకు మహిళలను యాక్సెస్‌ చేయడానికి మాకు చాలా అవసరం,” నీల్‌ టర్నర్‌, ఆఫ్ఘనిస్తాన్‌ కోసం నార్వేజియన్‌ రెఫ్యూజీ కౌన్సిల్‌ చీఫ్‌,  అసోసియేటెడ్‌ ప్రెస్‌తో మాట్లాడుతూ చెప్పారు. 

అమెరికా నిరసన 

అఫ్ఘనిస్థాన్‌లో మహిళల పట్ల తాలిబన్ల ఉద్యోగ ఆంక్షలపై అమెరికా నిరసన వ్యక్తం చేసింది. తాలిబన్ పాలకుల చర్యలతో చివరికి దేశంలో లక్షలాది మందికి కీలకమైన, ప్రాణ రక్షక సేవలు అందించడంలో అంతరాయం ఏర్పడుతుందని విమర్శించింది. ప్రపంచవ్యాప్తంగా మానవతా కార్యకలాపాలకు మహిళలు కేంద్రంగా ఉన్నారని, వారిని సేవల నుంచి తప్పించడం సరికాదని అమెరికా దేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌ స్పష్టం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా మహిళలే మానవతా సహాయ చర్యలకు ప్రధాన శక్తిగా ఉంటారని, ఈ క్రమంలో పలు దేశాలు సాయానికి ముందుకు వచ్చి స్థాపించిన ఎన్‌జిఒ సంస్థలలో బాధ్యతాయుతంగా సేవలు అందించే మహిళలపై ఉద్యోగ నిషేధాలు అవివేకం అవుతాయని బ్లింకెన్ పేర్కొన్నారు.

ఎన్‌జిఒ నిషేధ చర్యలపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ఓ ప్రకటనలో ఖండన వెలువరించారు. అయితే ఉద్యోగినులను తీసుకునే స్వచ్ఛంద సేవాసంస్థలు తమ దేశంలో లేకుండా చేస్తామని, వాటి నిర్వాహక లైసెన్సులు రద్దు చేస్తామని ఇటీవలే అఫ్ఘన్ ఆర్థిక మంత్రి ఖ్వారీ దిన్ మెహమ్మద్ హనీఫ్ ప్రకటించారు.