నేపాల్ నూతన ప్రధానిగా మావోయిస్టు నేత ప్రచండ

నేపాల్ నూతన ప్రధానిగా మావోయిస్టు నాయకుడు పుష్పకమల్‌ దహల్‌ (ప్రచండ) నియమితులయ్యారు. నేపాల్‌ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ ఆయనను నేపాల్‌ తదుపరి ప్రధానిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. 

దాంతో ప్రచండ వరుసగా కాకపోయినా ముచ్చటగా మూడోసారి నేపాల్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 275 స్థానాలకుగాను 89 స్థానాలను గెలుచుకుని అతి పెద్ద పార్టీగా ఏర్పడిన నేపాలి కాంగ్రెస్‌ గడువు లోపున ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది.

నేపాల్ ప్రతినిధుల సభలో 275 మంది సభ్యులు ఉండగా,  వీరిలో 165 మంది ప్రచండకు మద్దతు పలికారు. సీపీఎన్-యూఎంఎల్ (78), సీపీఎన్-ఎంసీ (32), ఆర్ఎస్‌పీ (20), ఆర్‌పీపీ (14), జేఎస్‌పీ (12), జనమత్ (6), నాగరిక్ ఉన్ముక్తి పార్టీ (3) ఆయనకు మద్దతిస్తున్నాయి.

మాజీ ప్రధాన మంత్రి ఓలీ నివాసంలో జరిగిన సమావేశంలో ఈ పార్టీల నేతలంతా పాల్గొని ప్రచండ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఆదివారం ఆరు పార్టీల నేతలు సమావేశమై ప్రచండ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం ఏకాభిప్రాయానికి రావడంతో నేపాల్‌లో అప్పటిదాకా నెలకొని ఉన్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది.

ఆ సమావేశంలో పుష్పకమల్‌ దహల్‌ మొదటి రెండున్నరేండ్లు, సీపీఎన్‌-యూఎంఎల్‌ కూటమి తర్వాత రెండున్నరేండ్లు ప్రధాని పదవులు చేపట్టాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. అనంతరం పుష్పకమల్ దహల్ అధ్యక్ష కార్యాలయంలో నేపాల్‌ అధ్యక్షురాలు విద్యాదేవి భండారిని కలిసి తన ప్రధాని అభ్యర్థిత్వానికి ఆమోదం తెలుపాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు.

ఆ తర్వాత కొన్ని గంటల్లోనే అధ్యక్షురాలు ప్రచండ వినతిని ఆమోదిస్తూ ఆయనను ప్రధానిగా నియమించారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను వెలువరించారు.