పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా

 పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ కంటే  ఆరు రోజుల ముందే ముగిశాయి. ఇవాళ పార్లమెంట్‌ ఉభయసభలను సభాపతులు నిరవధికంగా వాయిదా వేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో షెడ్యూల్‌ కంటే ముందే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలను ముగించాలని నిర్ణయించారు.

షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 29 వరకు పార్లమెంట్‌ వింటర్‌ సెషన్‌ కొనసాగాల్సి ఉండగా, ఈ నెల 23ననే సెషన్‌ను ముగించాలని బీఏసీలో నిర్ణయించారు. పండుగలు, నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా సమావేశాలను త్వరగా ముగించాలని సభ్యుల నుండి ప్రభుత్వానికి, ఉభయ సభల ప్రిసైడింగ్‌ అధికారులకు విజ్ఞప్తులు వచ్చాయి. 

ఆ మేరకు ఇవాళ లోక్‌సభ, రాజ్యసభ నిరవధికంగా వాయిదాపడ్డాయి. ఈసారి మొత్తం 13 రోజులపాటు సభ కొనసాగగా… 97 శాతం మెరుగైన పనితీరు సాధించినట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా  తన ముగింపు ప్రసంగంలో వెల్లడించారు.  శీతాకాల సమావేశాల్లో భాగంగా మొత్తం 13 బిల్లులు ఆమోదం పొందాయని చెప్పారు.

శుక్రవారం చివరి సెషన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష సభ్యులు మల్లికార్జున్‌ ఖర్గే, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, పీయూష్‌ గోయల్‌లు హాజరయ్యారు. రాజ్యసభ 102 శాతం పనితీరు సాధించిందని చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖర్‌ వెల్లడించారు. 13 రోజులపాటు కొనసాగిన ఈ సమావేశాల్లో 64 గంటల 50నిమిషాలు సభ సాగిందన్నారు. ఆగస్ట్‌ 10న ధన్‌ఖర్‌ ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన అనంతరం ఆయన  చైర్మన్‌గా వ్యవహరించిన మొదటి సమవేశాలు.

ఈ నెల 7న ప్రారంభమైన పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యపై ప్రధానంగా చర్చకు పట్టుబట్టాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి. అయితే, డిసెంబర్‌ 9న అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌ వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌-చైనా సైనికుల మధ్య ఘర్షణ చెలరేగడంతో.. అదే అంశంపై పార్లమెంట్‌ ఉభయసభలు దద్ధరిల్లాయి.

ఘటనపై ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రకటనలు చేయగా,  ప్రతిపక్షాలు మాత్రం సమగ్ర చర్చ జరగాలని పట్టుబట్టాయి. ప్రభుత్వం చర్చకు అంగీకరించకపోవడంతో నిత్యం రభస కొనసాగింది. చివరికి ఉభయసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.