కాశ్మీర్‌లో ఐదుగురు హిజ్బుల్ ఉగ్రవాదులు అరెస్ట్‌

జమ్ముకశ్మీర్‌లో భారీ ఉగ్రకుట్రను భద్రతా బలగాలు ఛేదించాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడంతోపాటు ఆయుధాలు సరఫరా చేస్తున్న ఐదుగురు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి పేలుడు సామగ్రి, ఆయుధాలను పెద్దసంఖ్యలో స్వాధీనం చేసుకున్నారు. 

కుప్వారాలో హిజ్బుల్‌ టెర్రర్‌ మాడ్యూల్‌కు సంబంధించి మిలిటరీ ఇంటెలిజెన్స్‌, జిల్లా పోలీసులు, ఇతర ఇంటెలిజెన్స్‌ వర్గాల నుంచి కశ్మీర్‌ పోలీసులకు సమాచారం అందింది. దీంతో సైన్యం, స్థానిక పోలీసులు కుప్వారా జిల్లాలోని క్రాల్‌పోరాలో సోదాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా హిజ్బుల్‌ సానుభూతిపరులైన అబ్‌ రవూఫ్‌ మాలిక్‌, అల్తావఫ్‌ అహ్మద్‌ పయర్‌, రియాజ్‌ అహ్మద్‌ లోనేను అదుపులోకి తీసుకున్నారు. విచారణ సందర్భంగా వారిచ్చిన సమాచారంతో మరో ఇద్దరిని అరెస్టు చేశారు. వారి నివాసాల్లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.

వీరు ఉగ్రవాదులకు సహాయం చేయడంతోపాటు, టెర్రిరస్టులకు ఆశ్రయం కల్పించడం, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి సమకూర్చడం వంటివి చేస్తున్నారని అధికారులు తెలిపారు.