దిగ్విజయ్ ముందే గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతల ఘర్షణ

తెలంగాణ కాంగ్రెస్ లో కుమ్ములాటలు తారాస్థాయికి చేరి, రెండు ముఠాలుగా విడిపోయే పరిస్థితి ఏర్పడడంతో, పరిష్టితులు చక్కదిద్దడం కోసం అధిష్ఠానం ప్రతినిధిగా వచ్చిన పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఒక వంక గాంధీ భవన్ లో ఒకొక్క నాయకుడితో మాట్లాడుతూ ఉండగానే బైట  కొట్లాటలు తగ్గడం లేదు. దిగ్విజయ్ సింగ్ గాంధీ భవన్‌లో కాంగ్రెస్ సీనియర్ లీడర్లతో మాట్లాడుతున్న సమయంలోనే.. బయట కాంగ్రెస్ నేతల మధ్య మళ్లీ గొడవ జరిగింది.
ఓయూ నుంచి వచ్చిన విద్యార్థి నేతలు.. మాజీ ఎమ్మెల్యే అనిల్ వర్గంతో వాగ్వాదానికి దిగారు. పార్టీ సీనియర్లు ఉత్తమ్ కుమార్, హనుమంతరావు, భట్టివిక్రమార్క, దామోదర రాజనరసింహ వంటి సీనియర్ నేతలను  కోవర్టులు అని అనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సీనియర్లకు అన్యాయం చేస్తున్నారని అంటూ విమర్శలు గుప్పించారు. ఐతే అక్కడే ఉన్న అనిల్.. ఎవరికి అన్యాయం జరిగిందని ప్రశ్నించారు.
 ఈ క్రమంలోనే మాటా మాటా పెరిగింది. ఇరువర్గాలు పరస్పరం  గల్లాలు పట్టుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మాజీ ఎమ్మెల్యే ఈరవర్తి అనిల్ పై దాడికి యత్నించారు. వెంటనే సీనియర్ నేత మల్లు రవి కలగజేసుకొని  ఇరువర్గాలకు సర్ధిచెప్పారు. అయినా వినకుండా ఆందోళనకు నేతలు దిగారు .  
 
కాంగ్రెస్ నేతలు సంయమనం పాటించాలని మల్లు రవి హితవు చెప్పారు.  మరోవంక,  దిగ్విజయ్ సింగ్ వరుసగా భేటీ అవుతున్నారు. పార్టీ పరిస్థితి, కమిటీల నియామకం, అసంతృప్తుల వాదనలు వింటున్నారు. గాంధీ భవన్ లో నేతలకు మూడు ప్రశ్నలు అడుగుతున్నారు.
బిఆర్ఎస్ ను ఓడించేందుకు తమ దగ్గర ఉన్న వ్యూహం ఏంటి? పార్టీ బలోపేతం కోసం ఏం చేశారు..ఏం చేయబోతున్నారు..? అంతర్గత సమస్యలపై అభిప్రాయాలు పరిష్కారం కోసం సలహాలు ఏంటని వరుస ప్రశ్నలు అడుతున్నట్లు తెలుస్తోంది. ఒక వైపు ప్రశ్నలు అడుగుతూనే మరోవైపు నేతలకు డిగ్గీ క్లాసులు తీసుకుంటున్నట్లు సమాచారం.
పార్టీలో జూనియర్, జూనియర్ పంచాయతీ ప్రస్తావనే ఉండొద్దని సూచించినట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఎవరూ ఏం చేస్తున్నారో హైకమాండ్ అంతా గమనిస్తుందని..ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే సీరియస్ యాక్షన్ తప్పదని హెచ్చరించినట్లు తెలుస్తోంది.