ర‌ద్దీగా ఉండే ప్ర‌దేశాల్లో ప్ర‌జ‌లు మాస్క్‌లు ధ‌రించండి

చైనాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈరోజు కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మ‌న్సూక్ మాండ‌వీయ ఉన్న‌త అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. సమావేశం అనంతరం మంత్రి ట్వీట్ చేస్తూ కరోనా  ఇంకా ముగిసిపోలేద‌ని, అంద‌రూ అప్రమత్తంగా ఉండాల‌ని, నిఘా పెంచాల‌ని ఆదేశించిన‌ట్లు తెలిపారు.

ర‌ద్దీగా ఉండే ప్ర‌దేశాల్లో ప్ర‌జ‌లు మాస్క్‌లు ధ‌రించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం సూచ‌న చేసింది. ఎటువంటి ప‌రిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్న‌ట్లు చెప్పారు. మంత్రి మాండ‌వీయతో పాటు సమావేశంలో పాల్గొన్న అధికారులు అంద‌రూ మాస్క్‌లు ధ‌రించారు.
ఎలాంటి భయాందోళనకు గురవాల్సిన అవసరం లేదని, విదేశాల నుంచి రాకపోకలపై ప్రస్తుతానికైతే ఎలాంటి ఆంక్షలు లేవని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా పరిస్థితిని పర్యవేక్షించేందుకు వారానికొకసారి సమావేశాలు నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశంలో నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌,తో పాటు ఉన్నతాధికారులు,  నిపుణులు  పాల్గొన్నారు. 
ప్రస్తుతం దేశంలో కొవిడ్‌ కేసులు అదుపులోనే ఉన్నాయని, క్రియాశీల కేసులు ఐదువేలకు దిగువనే ఉన్నాయని వివరించింది. చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, బ్రెజిల్‌, అమెరికాల్లో దేశాల్లో కొవిడ్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికాలో కొవిడ్‌ కేసుల సంఖ్య మొత్తం 10కోట్లు దాటిందని కేంద్రం వివరించింది.
ఈ సమావేశం ముగిసిన అనంతరం డాక్టర్ వీకే పాల్ విలేకరులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించాల్సి ఉంటుందని సూచించారు. గుంపులు గుంపులుగా ఉన్న ప్రదేశాలతో పాటు ఇండోర్, ఔట్ డోర్స్‌లల్లో మాస్కులను ధరించాలని చెప్పారు. దీర్ఘకాల వ్యాధులు ఉన్న వారు, వయోధిక వృద్ధులు తప్పనిసరిగా మాస్కులను ధరించాలని స్పష్టం చేశారు.
 
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 27 నుంచి 28 శాతం మంది మాత్రమే ప్రికాషన్ డోస్ తీసుకున్నారని డా. వీకే పాల్ చెప్పారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ఈ డోస్‌ను తీసుకునే విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరించారు. మిగిలిన వారు కూడా ఈ విషయంలో ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని అన్నారు. ప్రికాషన్ డోస్ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని సూచించారు. విమాన ప్రయాణికులపై ఆంక్షలను విధించడంపై ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
ఈ సమీక్ష సమావేశం ముఖ్యంగా 6 కీలక అంశాలపై జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ, దేశీయ విమానాశ్రయాల్లో కేసులను నిరోధించే వ్యూహం, విదేశాల నుంచి ప్రయాణించే ప్రయాణీకుల కోసం మార్గదర్శకాలు రూపొందించడం, కరోనా కొత్త వేరియంట్‌ పై నిపుణులతో సంప్రదింపులు జరడం వంటివి ఇందులో ఉన్నాయి. రాబోయే కొత్త సంవత్సర వేడుకలకు సంబంధించిన ప్రోటోకాల్‌పై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.