నౌకాదళం అమ్ములపొదిలోకి వాగిర్‌ సబ్‌మెరైన్‌

కల్వరి విభాగం జలాంతర్గామి వాగిర్‌ భారత నౌకాదళం అమ్ములపొదిలో చేరింది. మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఈ సబ్‌మెరైన్‌ను నేవీ అధికారులకు అప్పగించారు. కేవలం 24 నెలల వ్యవధిలో మూడవ జలాంతర్గామిని భారత నౌకాదళానికి అందించారు. ఇది ప్రాజెక్ట్‌-75 లోని ఐదో కల్వరి తరగతి జలంతర్గామి యార్డ్ 11879. ఈ ప్రాజెక్ట్‌ కింద మొత్తం 6 స్వదేశీ జలంతర్గాములను స్కార్పెన్‌ డిజైన్ సంస్థ తయారుచేసి ఇవ్వనున్నది. ఈ సబ్‌మెరైన్‌ను మజాగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ముంబైలో నిర్మిస్తున్నది.

ఫ్రాన్స్‌కు చెందిన మెస్సర్స్‌ నావల్ గ్రూప్ దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నది. 6 జలాంతర్గాములను ఉత్పత్తి చేసేందుకు 2005 లో ఈ రెండు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ జలాంతర్గామి రాకతో భారత నావికాదళం బలం పెరగనున్నదని నేవీ అధికారులు తెలిపారు.  ఇతర జలాంతర్గాములతో పోలిస్తే అతి తక్కువ సమయంలో ఆయుధాలు, సెన్సార్ల ప్రధాన ట్రయల్స్‌ను పూర్తి చేసుకోవడం విశేషం.

వాగిర్ 2022 ఫిబ్రవరి నుంచి సముద్ర ట్రయల్స్‌ ప్రారంభించింది. ఇతర జలాంతర్గాములతో పోలిస్తే అతి తక్కువ సమయంలో ఆయుధాలు, సెన్సార్ల ప్రధాన ట్రయల్స్‌ను పూర్తి చేసుకోవడం విశేషం. భారత నౌకాదళానికి 25 జలాంతర్గాములను అందించాలని ఇంద్ర కుమార్ గుజ్రాల్ నేతృత్వంలోని అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

దీని కోసం ప్రాజెక్ట్ 75 ను రూపొందించారు. ఈ ప్రాజెక్ట్ కింద సబ్‌మెరైన్లను తయారుచేయడానికి 30 ఏండ్ల ప్రణాళిక రూపొందించారు. 2005 లో భారత్‌-ఫ్రాన్స్ మధ్య 6 స్కార్పెన్-డిజైన్ జలాంతర్గాములను ఉత్పత్తి చేయడానికి 3.75 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది. కల్వరి తరగతికి చెందిన తొలి సబ్‌మెరైన్‌ను 2017లో ఇండియన్‌ నేవీ అందుకున్నది.