ఈడీ మరో చార్జిషీట్ లోనూ కవిత పేరు!

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌తో ఎమ్మెల్సీ కవిత పీకల్లోతు మునిగిపోతున్నట్లు స్పష్టం అవుతుంది.  ఈ కుంభకోణంలో ఇండోస్పిరిట్ కంపెనీ నిర్వాహకుడు సమీర్ మహేంద్రు  పాత్రపై తాజాగా 181 పేజీలతో దాఖలు చేసిన కొత్త చార్జిషీట్ లోనూ   కల్వకుంట్ల కవిత పేరును ప్రస్తావించారు. 

చార్జిషీట్ లోని 95, 96, 125వ పేజీల్లో కవిత పేరును  ఈడీ అధికారులు ప్రస్తావించారు.  ఇండోస్పిరిట్ కంపెనీకి ఢిల్లీలో ఎల్1 లైసెన్సుతో వచ్చిన షాపుల్లో కవితకు వాటా ఉందని ఈడీ పేర్కొంది. సమీర్ కంపెనీ ఇండోస్పిరిట్ లో కవితకు 32 శాతం వాటా ఉన్నట్లు అభియోగం నమోదు చేసింది. మాగుంట శ్రీనివాసులురెడ్డికి కూడా  ఈ కంపెనీలో వాటా ఉందని పేర్కొంది. 

అందులో 28 సార్లు కవిత పేరును ప్రస్తావించింది. కవితతో కలిసే సమీర్‌ మహేంద్రు మద్యం వ్యాపారం చేసినట్లు వెల్లడించింది. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పన సమయంలో కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ్‌, అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌ రెడ్డి, అభిషేక్‌ బోయినపల్లి, ఆడిటర్‌ బుచ్చిబాబు, పెర్నార్డ్‌ రికార్డ్‌కు చెందిన బినయ్‌ బాబు పలుమార్లు ఆప్‌ నేతలతో భేటీ అయ్యారని, హోల్‌సేల్‌, రిటైల్‌ ఉత్పత్తిదారులతో కుమ్మక్కై కార్టెల్‌(సిండికేట్‌)ను ఏర్పాటు చేశారని స్పష్టం చేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం వల్ల  ఇండో స్పిరిట్ కంపెనీకి అక్రమంగా రూ.192.8 కోట్లు లాభం వచ్చిందని చార్జిషీట్ లో ఈడీ పేర్కొంది. లిక్కర్ స్కాం కుట్ర ద్వారా సంపాదించిన  ఈ  ఆదాయంలో ఎక్కువ భాగం కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డికే పోయిందని ఆరోపించింది. కవిత వాడిన ఫోన్ల వివరాలను, వాటిని ఐఎంఈఐ నంబర్లను కూడా ఈడీ ప్రస్తావించింది. ఫోన్లను ధ్వంసం చేసిన అంశాన్ని కూడా చార్జిషీట్ లో పెట్టారు.  

కవిత, మాగుంట రాఘవ్‌, శరత్‌రెడ్డి నిర్వహిస్తున్న సౌత్‌గ్రూ్‌ప.. ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిందని దినేశ్‌ అరోరా వాంగ్మూలాన్ని ఉటంకిస్తూ పేర్కొంది. అరుణ్‌పిళ్లై, అభిషేక్‌ బోయినపల్లి, బుచ్చిబాబులు సౌత్‌గ్రూ్‌ప తరఫున ఢిల్లీలో ప్రాతినిధ్యం వహించినట్లు తెలిపింది.

ఇండో స్పిరిట్‌ వ్యాపార వ్యవహారాల్లో కవిత ప్రయోజనాలకు అరుణ్‌ పిళ్లై.. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రయోజనాలకు ప్రేమ్‌రాహుల్‌ మండూరి ప్రాతినిధ్యం వహించారు. తమ తరఫున వాస్తవంగా పెట్టుబడి పెడుతున్నవారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కవిత, శరత్‌రెడ్డిలు అని అరుణ్‌, ఆయన బృందం అనేక సంభాషణల్లో సమీర్‌కు వెల్లడించింది. ఇండోస్పిరిట్‌లో సీఎం కేసీఆర్‌ కుమార్తె కవిత ఆసక్తి ప్రదర్శించారని, ఆమె తరఫున తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానని సమీర్‌కు అరుణ్‌ పిళ్లై చెప్పారు.

ఈ ఏడాది ఆరంభంలో సమీర్‌ హైదరాబాద్‌ వచ్చారు. కవితను ఆమె నివాసంలో కలుసుకున్నారు. ఈ సమావేశంలో సమీర్‌, శరత్‌, అరుణ్‌ పిళ్లై, అభిషేక్‌ బోయినపల్లి, కవిత, ఆమె భర్త అనిల్‌ పాల్గొన్నారు. తనకు అరుణ్‌ కుటుంబ సభ్యుడులాంటి వారని అరుణ్‌తో వ్యాపారం చేస్తే తనతో వ్యాపారం చేసినట్లేనని కవిత సమీర్‌కు చెప్పారు. ఈ సంబంధాన్ని అనేక రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విస్తరిస్తామని ఆమె ఆయనకు తెలిపారు.