అరుణాచ‌ల్ స‌మీపంలో చైనా డ్రోన్లు, జెట్ విమానాలు

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న టిబెట్ విమానాశ్ర‌యంలో అత్యాధునిక డ్రోన్లు, జెట్ విమానాల‌ను చైనా మోహ‌రించిన‌ట్లు తెలుస్తోంది. ఆ డ్రోన్లు, జెట్ల‌కు చెందిన హై రెజ‌ల్యూష‌న్ శాటిలైట్ ఇమేజ్‌లు లీక‌య్యాయి. మాక్స‌ర్ సంస్థ ఆ ఫోటోల‌ను రిలీజ్ చేసింది. ఇటీవ‌ల అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ బోర్డ‌ర్ స‌మీపంలోని త‌వాంగ్ వ‌ద్ద‌ చైనా, భార‌త సైనికుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగిన విష‌యం తెలిసిందే.
టిబెట్ విమానాశ్ర‌యం బాంగ్డా ఎయిర్‌బేస్‌లో భారీ సంఖ్య‌లో డ్రోన్లు, జెట్ల‌ను ఉంచిన‌ట్లు ఉప‌గ్ర‌హ చిత్రాల ద్వారా అంచ‌నా వేశారు.  అరుణాచ‌ల్ వ‌ద్ద చైనా క‌దిల‌క‌లు పెర‌గ‌డంతో.. ఇటీవ‌ల భార‌త వైమానిక ద‌ళం యుద్ధ విమానాల‌తో పెట్రోలింగ్ కూడా నిర్వ‌హించింది. చైనాలోని బాంగ్డా ఎయిర్‌బేస్ అరుణాచ‌ల్ బోర్డ‌ర్ నుంచి 150 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. ఆ బేస్‌లో అత్యాధునిక డ‌బ్ల్యూజెడ్‌-7 సోరింగ్ డ్రాగ‌న్ డ్రోన్‌ను మోహ‌రించారు.
2021లోనే ఆ డ్రోన్‌ను ఆవిష్క‌రించారు. ఇది 10 గంట‌ల పాటు నాన్‌స్టాప్‌గా ఎగురుతుంది. ఇంటెలిజెన్స్‌, స‌ర్వియ‌లెన్స్ మిష‌న్ల కోసం వీటిని వాడుతారు. భార‌త్ వ‌ద్ద ఇలాంటి డ్రోన్లు లేవ‌ని నిపుణులు చెబుతున్నారు. డిసెంబ‌ర్ 14వ తేదీన మాక్సర్ ఆ ఫోటోల‌ను తీసింది. సుఖోయ్‌-30 లాంటి రెండు ఫైట‌ర్ జెట్స్‌ను కూడా చైనా ఆ విమానాశ్ర‌యంలో ఉంచింది.
కాగా, చైనా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నదని పేర్కొంటూ భారత్ సరిహద్దులో సేనలను సమీకరిస్తున్నట్లు తమకు తెలుసని అమెరికా పెంటగాన్ ప్రెస్ కార్యదర్శి పాట్ రైడర్ తెలిపారు. పైగా, సైనిక మౌళిక సదుపాయాలను సహితం పెంపొందిస్తున్నదని చెబుతూ, ఉద్రిక్తలను తగ్గించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలు అమెరికా మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు.