కాంగ్రెస్ నేతలకు బీజేపీలోకి చేరాలని రాజగోపాల్ రెడ్డి పిలుపు

ఒక వంక తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు జరుగవచ్చని హడావుడి  నెలకొనగా, ఎన్నికలకు సమాయత్తం కావలసిన కాంగ్రెస్ పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దూషణలకు దిగుతున్నారు. పార్టీ ప్రక్షాళన కోసం అంటూ ఏఐసీసీ నియమించిన పిసిసి కమిటీలు పార్టీలో చిచ్చు రేపాయి. 
 
ఈ కమిటీలలో తమకు తగు గౌరవం లభించలేదని అంటూ పదవులకు కొండా సురేఖ వంటి నేతలు రాజీనామాలు చేయగా, మరోవంక సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంట్లో సీనియర్ నేతలు సమావేశమై టిడిపి నుండి వలస వచ్చిన వారితో కమిటీలు నింపారంటూ ధ్వజమెత్తారు. ఈ సమస్య తేలేవరకు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఏ సమావేశంలో, కార్యక్రమంలో పాల్గొనబోమని స్పష్టం చేశారు. 
 
ఇంకోవైపు, రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తున్న టిడిపి నుండి వచ్చి కాంగ్రెస్ లో పదవులు పొందిన 12 మంది తమ పదవులకు రాజీనామాలు ప్రకటించారు. పదవులు లేకుండానే పార్టీ కోసం పని చేస్తాం అంటూ ప్రకటించారు. ఈ గందరగోళ మధ్య ఆదివారం సాయంత్రం జరిగిన మొదటి కొత్త పిసిసి కార్యవర్గ సమావేశంపై అన్నట్లుగానే సీనియర్లు గైరాజర్ అయ్యారు. 
 
బిజెపి , టిఆర్ఎస్ పోటాపోటీగా జనాల్లోకి వెడుతుండగా కాంగ్రెస్ నేతలు మాత్రం అంతర్గత కుమ్ములాటలతో సతమతమైన్నట్లు కనిపిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ కాంగ్రెస్ నేత , ప్రస్తుత బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు బిజెపిలోకి రావాలని ఆహ్వానం అందించారు.
 
రేవంత్ రెడ్డి కింద పనిచేయడం కంటే రాజకీయమే మానేయాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడో చెప్పిన మాటలు ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెబుతున్నారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి గురించి తాను మాట్లాడినప్పుడు ఎవరూ నమ్మలేదని, ఇప్పుడు ఆలోచిస్తున్నారని చెప్పారు. 
 
డబ్బులు ఇచ్చి పీసీసీ పదవి తెచ్చుకుండు అని రేవంత్ రెడ్డి పై విమర్శలు చేశారు. కేసీఆర్ అవినీతి బయటకు తీయాలంటే బీజేపీతోనే సాధ్యం అని  స్పష్టం చేస్తూ  కుటుంబ పాలన పోయి ప్రజాస్వామ్య పాలన కావాలంటే బీజేపీతో కలసి పని చేయాలని వారికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఏమి ఒరగపెట్టాడని దేశ రాజకీయాలకు పోతుండు అంటూ కేసీఆర్ పై ఆయన  మండిపడ్డారు.
 
కాంగ్రెస్ లో చెలరేగిన ఈ సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని రాష్ట్ర బీజేపీ నేతలు ప్రయత్నం చేస్తున్నట్లు రాజగోపాల్ రెడ్డి బహిరంగ ఆహ్వానం వెల్లడి చేస్తుంది.  కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు నేతలతో టచ్‌లో ఉంటూ ఆ పార్టీ సీనియర్ నేతలతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఫోన్‌లో మాట్లాడినట్టు తెలుస్తోంది. 
 
బీఆర్ఎస్‌పై తిరుగు బావుటాను ఎగుర వేసేందుకు తమ పార్టీతో కలిసి రావాలని కాంగ్రెస్ నేతలకు బీజేపీ నేతలు వల విసురుతున్నారు. ఇప్పటికే సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు.