తెలంగాణాలో రెండుగా చీలిపోయిన కాంగ్రెస్!

వచ్చే ఎన్నికలను  ఉంచుకొని తెలంగాణాలో పార్టీని ప్రక్షాళన కావించడం కోసం ఏఐసీసీ తాజాగా కమిటీలు వేస్తే, అవి పార్టీని నిట్టనిలువున రెండుగా చీల్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తమకు కమిటీలలో తగు ప్రాధాన్యత లేదని కొందరు అసమ్మతి వ్యక్తం చేస్తూ, పదవులకు రాజీనామా  చేయగా, పలువురు సీనియర్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంట్లో శనివారం సమావేశమై టిడిపి నుండి వచ్చిన వారికే పదవులు ఇచ్చారంటూ మండిపడ్డారు. 

కాంగ్రెస్ పార్టీని హైజాక్  చేసే కుట్ర జరుగుతున్నదంతా `సేవ్ కాంగ్రెస్’ పేరుతో ఉద్యమం ప్రకటించారు. కొత్త కమిటీలలో 108 మంది ఉంటే అందులో 50 మంది వలస వచ్చిన వారే అని మండిపడ్డారు.

టిడిపి నుంచి వలస వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ  మమ్మల్ని కోవర్టులుగా ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మొరను పార్టీ అధిష్ఠానం వినేంత వరకు తాము పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జరిపే కార్యక్రమాలకు హాజరు కాబోమని స్పష్టం చేశారు.  అన్నట్లు గానే ఆదివారం సాయంత్రం గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీకి ముందు చెప్పినట్టుగానే సీనియర్ నాయకులు డుమ్మా కొట్టారు.

దానితో, ఆదివారం రేవంత్ మద్దతు దారులు ఆదివారం ఎదురు దాడి చేపట్టారు. ఇటీవల కొత్త కమిటీలలో పదవులు లభించిన  టిడిపి నుంచి కాంగ్రెస్  లో చేరిన 13 మంది నాయకులు రాజీనామా చేశారు. అందులో సీతక్క, ఎర్ర శేఖర్, వేం నరేందర్, విజయ రామారావు, చారకొండ వెంకటేష్, పటేల్ రమేష్, సత్తు మల్లేష్, విజయ రమణారావు సహా మరికొంతమంది ఉన్నారు. 

రాజీనామా చేస్తూ మాణిక్యం ఠాగూర్ కు లేఖ వ్రాస్తూ తమవల్లన పదవులు రాలేదని విమర్శిస్తున్న వారికి ఆ పదవులు కట్టబెట్టాలని ఎద్దేవా చేశారు.  దానితో కాంగ్రెస్ లో కుమ్ములాటలు మరింతగా ముదురుతున్నట్లు స్పష్టం అవుతుంది.