కల్తీ మద్యం కేసు సుమోటోగా చేపట్టిన ఎన్ ఎచ్ ఆర్ సి

బీహార్‌లో కల్తీ మద్యం సేవించి 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించిన కేసును జాతీయ మానవ హక్కుల కమిషన్‌  సుమోటోగా తీసుకుంది. ఘటనకు సంబంధించి గత మూడు రోజులుగా మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా కేసును సుమోటోగా తీసుకున్నట్లు  కమిషన్‌ తెలిపింది.

బీహార్‌ రాష్ట్రం సరాన్‌ జిల్లాలో గత మంగళవారం రాత్రి కల్తీ మద్యం సేవించి పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూనే ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతూ వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నానికి ఈ దుర్ఘటనకు సంబంధించిన మరణాల సంఖ్య 60కి చేరింది.  ఇంకా పలువురి పరిస్థితి విషమంగానే ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు చెబుతున్నారు.

బీహార్‌లో 2016, ఏప్రిల్‌ నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నారు.  దాంతో మద్యానికి అలవాటు పడిన కొందరు దొంగచాటుగా లభ్యమయ్యే కల్తీ మద్యాన్ని సేవిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. 2016 నుంచి బీహార్‌లోని ఎక్కడో ఒకచోట తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అయితే, తాజా మరణాలపై రాష్ట్రంలో రాష్ట్రంలో రాజకీయ దుమారం చెలరేగుతున్నది.

కల్తీ మద్యం చావులకు ముఖ్యమంత్రి నితీశ్‌కుమారే కారణమని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఘటనకు బాధ్యత వహిస్తూ నితీశ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. కాగా, ఈ మరణాలపై సీఎం నితీశ్‌ అసెంబ్లీలో మాట్లాడుతూ తాగితే చస్తారు అని వ్యాఖ్యానించడం కూడా తీవ్ర దుమారం రేపుతున్నది.

ముఖ్యమంత్రి వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యంగా ఉన్నాయని బీజేపీ ఎంపీ  సుశీల్‌ కుమార్‌ మోదీ మండిపడ్డారు. మద్య నిషేధం అమలు చేస్తున్న నితీశ్‌ కుమార్‌ కల్తీ మద్యాన్ని నిర్మూలించడంలో విఫలమయ్యారని ఆయన విమర్శించారు. కల్తీ మద్యం కాటుకు గడిచిన ఆరేండ్లలో 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.