లోక్‌సభ ఎన్నికలకై బీజేపీ ఉన్నత స్థాయి బృందం

2024 లోక్‌సభ ఎన్నికలకు సిద్దమవుతున్న బిజెపి జాతీయ నాయకత్వం ఎన్నికల సన్నాహక చర్యలకు సంబంధించి బీజేపీ నాయకత్వం ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేసింది. అందులో ఐదుగురు ప్రముఖ నేతలకు స్థానం కల్పించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఐదుగురి వ్యూహాలను ఉపయోగించుకునేలా కనిపిస్తోంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచనలతో ఏర్పాటు చేసిన  ఈ బృందంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లకు చోటు కల్పించినట్లు సమాచారం. 

ఈ బృందం 2024 లోక్‌సభ ఎన్నికల కోసం రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తుంది. ఈ బృందం రూపొందించిన రోడ్‌మ్యాప్‌పై మాత్రమే దేశవ్యాప్తంగా ఎన్నికల సన్నాహాలు జరుగుతాయి.  దీనిపై వచ్చిన ఫీడ్‌బ్యాక్ ప్రకారం పార్టీ సాధారణ ప్రజల్లోకి వెళుతుంది. ఈ బృందంలో కేంద్ర నేతలతో పాటు బయట నుండి యోగి ఆదిత్యనాథ్ కు మాత్రమే చోటు దక్కింది. ఇటీవల పార్లమెంటరీ బోర్డులో స్థానం దక్కక పోవడంతో యోగి ఆదిత్యనాథ్ జాతీయ నాయకత్వంకు దూరమవుతున్నారని మీడియా కథనాలను కొట్టిపారవేసిన్నట్లయింది.

ఈ బృందం తొలి సమావేశం మంగళవారం ఢిల్లీలోని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగింది. దాదాపు రెండున్నర గంటలపాటు జరిగిన ఈ భేటీలో వచ్చే లోక్‌సభ ఎన్నికల వ్యూహంపై ఈ తొలి సమావేశంలో చర్చించినట్లు తెలుస్తున్నది. దీనితో పాటు సరైన ఫీడ్ బ్యాక్ పొందడంపై కూడా చర్చ జరిగింది. 

ఆ ఫీడ్ బ్యాక్ ఆధారంగా రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయవచ్చు. ఇది మాత్రమే కాదు, సమాజంలోని ప్రతి వర్గానికి, ముఖ్యంగా దళితులు, వెనుకబడిన, గిరిజనుల కోసం అమలు చేస్తున్న పథకాలపై దృష్టి సారించి రోడ్‌మ్యాప్‌లో తీసుకురావాలనే చర్చ జరిగింది. వీటన్నింటితో పాటు ఈ బృందం రూపొందించిన రోడ్‌మ్యాప్‌పై బిజెపి నాయకత్వం త్వరలో మరిన్ని కమిటీలను ఏర్పాటు చేయనుంది.

ఇప్పటికే దేశంలో 144 లక్షిత నియోజకవర్గాలను గుర్తించి, ఒకొక్క కేంద్ర మంత్రికి కొన్ని నియోజకవర్గాలు చొప్పున కేటాయించే, రాబోయే 18 నెలల వరకు ఆయన నియోజకవర్గాలలో కేంద్ర  ప్రభుత్వ పధకాల అమలుతో పాటు పార్టీ సంస్థాగత వ్యవహారాల లోటుపాట్లను పర్యవేక్షించమని నిర్ధేశించింది. ఇప్పటికే కేంద్ర మంత్రులు క్రమం తప్పకుండా ఆయా నియోజకవర్గాలలో పర్యటనలు జరుపుతూ, క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అంచనా వేస్తున్నారు. పార్టీ శ్రేణులను క్రియాశీలం చేస్తున్నారు. 

2024 లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్‌లో విజయం సాధించినట్లే చారిత్రాత్మకంగా నిలవాలని, వరుసగా మూడోసారి కేంద్రంలో మరింత రికార్డు ఆధిక్యతతో తిరిగి అధికారంలోకి రావాలని  బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది.  అందుకోసమే, ఇప్పటి వరకు పార్టీ గెలుపొందని నియోజకవర్గాలకు, రాష్ట్రాలపై – ముఖ్యంగా దక్షిణ, తూర్పు ప్రాంతాలలో ప్రత్యేక దృష్టి సారిస్తోంది. దక్షిణాదిన తెలంగాణాలో అధికారంలోకి రావాలని పట్టుదలతో పనిచేస్తున్నది.