ప్రజా రవాణా వినియోగంలో ఎక్కువగా మహిళలే 

భారత్‌లో ప్రజారవాణా వ్యవస్థను ఎక్కువగా వినియోగించుకొంటున్నది మహిళలేనని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది. 84 శాతం మహిళల ప్రయాణాలు ప్రజా రవాణా వ్యవస్థ ద్వారానే జరుగుతున్నాయని అంచనా వేసింది. అయితే ఇదే సమయంలో భద్రతా, సౌకర్యం తదితర కారణాలతో పురుషులతో పోలిస్తే ఎక్కువ మంది మహిళలు పనికి నడిచి వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారని తెలిపింది.
 45.4 శాతం మంది మహిళలు కాలినడకపై పనికి వెళ్తుండగా.. పురుషుల్లో ఇది 27.4 శాతంగా ఉన్నదని తెలిపింది. అయితే, భారత్‌లో ప్రజారవాణా వ్యవస్థను మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని రూపొందించలేదని నివేదిక పేర్కొన్నది. దీని కారణంగా ఉద్యోగాలకు వెళ్లే వారి సంఖ్య తక్కువగా ఉన్నదని ‘ఎనేబ్లింగ్‌ జెండర్‌ రెస్పాన్సివ్‌ అర్బన్‌ మొబిలిటీ అండ్‌ పబ్లిక్‌ స్పేసెస్‌ ఇన్‌ ఇండియా’ పేరుతో విడుదల చేసిన నివేదికలో విశ్లేషించింది.
2019-20లో భారత్‌లో మొత్తం శ్రామిక శక్తిలో మహిళల శాతం 22.8 శాతంగా ఉన్నదని నివేదిక గుర్తుచేసింది. ప్రజా రవాణా వ్యవస్థను ఏ విధంగా రూపొందించాలి, మహిళా ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా ఎలాంటి సమగ్ర చర్యలు చేపట్టాలనే దానిపై ఈ నివేదిక భారత్‌లోని నగరాలకు మార్గనిర్దేశం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
 భద్రత లేకుంటే మహిళలు బయటకు వెళ్లడం తగ్గుతుందని, ఫలితంగా ప్రజా రవాణా వారి ప్రాతినిధ్యం తగ్గుతుందని నివేదిక పేర్కొన్నది. బహిరంగ ప్రదేశాల్లో వీధి దీపాలను పెంచడం, వాకింగ్‌-సైక్లింగ్‌ ట్రాక్‌లను మెరుగుపరచడం వంటి చర్యల వల్ల నాన్‌-మోటర్‌ ట్రాన్స్‌పోర్టు వ్యవస్థను అధికంగా ఉపయోగించే మహిళలకు ఉపయోగపడుతుందని సూచించింది.