అంతరిస్తున్నట్లు భావిస్తున్న మలేరియా మళ్ళి విజృంభణ

భారత్ నుండి కనుమరుగైనదని భావిస్తున్న మలేరియా కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా  మళ్ళి వ్యాపిస్తుంది. కరోనాతో  మలేరియా నివారణ చర్యలకు ఆటంకం కలిగిందని, దీంతో మలేరియా కేసులు, మరణాలు పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఒ) వెల్లడించింది.

గత వారం విడుదల చేసిన  ‘వరల్డ్‌ మలేరియా రిపోర్ట్‌-2022’ ప్రకారం మొత్తం 11 దేశాల్లో మలేరియా కేసులు ఎక్కువగా ఉండగా,  భారత్‌తో పాటు కాంగో, ఘనా, నైగర్‌, టాంజానియాల్లో తీవ్రత అధికంగా ఉందని వివరించింది. ఈ దేశాల్లో మలేరియా మరణాలు తగ్గినట్లు వెల్లడించింది. మరణాల్లో 96 శాతం 29 దేశాల నుంచే సంభవిస్తున్నట్లు నివేదించింది. 

2020లో మలేరియా మరణాల సంఖ్య 6.25 లక్షలు కాగా, 2021 నాటికి 6.19 లక్షలకు తగ్గాయని వెల్లడించింది. కరోనాకు ముందు  2019లో మృతుల సంఖ్య 5.68 లక్షలుగా ఉన్నట్లు పేర్కొంది. 2019తో పోల్చితే 2020లో మరణాలు పదిశాతం పెరిగాయని డబ్ల్యూహెచ్‌ఒ పేర్కొంది. 

2021లో మొత్తం 24,70 కోట్ల మలేరియా కేసులు నమోదవ్వగా.. 2020లో వాటి సంఖ్య 24.50 కోట్లని తెలిపింది. 2019లో ఆ సంఖ్య 23.20 కోట్లేనని పేర్కొంది. అగ్నేయాసియా ప్రాంతంలో నమోదయ్యే మొత్తం కేసుల్లో 79 శాతం, మరణాల్లో 83 శాతం భారత్‌ నుంచే వస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 

మలేరియా అంతానికి ప్రస్తుతం దేశాలు తీసుకుంటున్న చర్యలు సమర్థంగా లేవని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ మలేరియా నియంత్రణ, నిర్మూలనలో తాజా పోకడలపై సమాచారాన్ని అందిస్తుంది. 

ఈ సంవత్సరం నివేదికలో 3 కొత్త విభాగాలు ఉన్నాయి. 1) 2021, 2022లో ప్రారంభించబడిన ప్రపంచ, ప్రాంతీయ కార్యక్రమాలు (2) గ్లోబల్‌ మలేరియా నిఘా. నిఘా వ్యవస్థల అంచనాలపై దేశ-స్థాయి కేస్‌ స్టడీస్‌ (3) పరిశోధన, అభివృద్ధి. నివేదికలో మలేరియా నియంత్రణకు వచ్చే ముప్పులపై విస్తరించిన విభాగాన్ని కూడా చేర్చింది.