మంత్రి తలసానిని చుట్టుకుంటున్న క్యాసినో  ఉచ్చు!

ఒక వంక ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత నిఘా సంస్థల విచారణకు గురవుతుండగా, మరోవంక తెలంగాణలో సంచలనం సృష్టించిన చికోటి ప్రవీణ్ క్యాసినో కేసు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చుట్టూ తిరుగుతున్నది. 
 
ఈ కేసు దర్యాప్తులో వేగం పెంచిన ఈడీ తాజాగా  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏ అశోక్‌ను విచారిస్తోంది. మనీ ల్యాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై ఈడీ ఆయన్ను సోమవారం ఉదయం నుండి ప్రశ్నిస్తోంది. ఈ కేసులో మంత్రి తలసాని సోదరులతో పాటు మరో పీఏ హరీశ్‌ను హైదాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో అధికారులు గతంలోనే విచారించారు.  హరీశ్ స్టేట్‌మెంట్‌ను సైతం రికార్డు చేశారు.
ఈ కేసులో టీఆర్ఎస్ నేతలకు సంబంధమున్న వ్యక్తులను విచారణకు పిలవడం అధికార పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇప్పటికే ప్రముఖ వ్యాపారవేత్త బుచ్చిరెడ్డి సైతం ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. బుచ్చిరెడ్డి, తలసాని పీఏ హరీష్ తమ బ్యాంక్ వివరాలతో సహా విచారణకు హాజరయ్యారు.
ఇక డీసీసీబీ చైర్మన్ దేవేంధర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణను సైతం ఈడీ అధికారులు విచారించారు. ఫెమా నిబంధనల ఉల్లంఘనతో పాటు హవాలా నగదు చెల్లింపులపై ఈడీ అధికారులు ఆరా తీశారు. లావాదేవీలతో సంబంధం ఉన్న వారందరినీ విచారిస్తున్నారు. ఈ కేసులో అనంతపురం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గురునాథ్ రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది.
హరీశ్‌, ఎల్. రమణను విచారించిన సమయంలోనే గురునాథ్ రెడ్డిన సైతం ఈడీ ప్రశ్నించింది. ఆయన కూడా బ్యాంక్ స్టేట్‌మెంట్లతో ఇటీవల ఈడీ విచారణకు హాజరయ్యారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి యాదవ్‌కు కూడా నోటీసులు వచ్చినట్లు గతంలో ప్రచారం జరిగింది. కాగా.. తనకు ఎలాంటి నోటీసులు ఈడీ నుంచి రాలేదని, తనకు క్యాసినో‌తో అసలు సంబంధం లేదని చెప్పారు. అసలు చీకోటి ప్రవీణ్ ఎవరో కూడా తెలియదని సాయి కుమార్ వెల్లడించారు.

క్యాసినో కేసులో చీకోటి ప్రవీణ్ కీలక వ్యక్తిగా ఉండగా ఇటీవల మళ్లీ అతడిని ఈడీ విచారణకు పిలిచింది. అప్పటి నుంచి ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఈడీ దృష్టి పెట్టి వారికి నోటీసులు జారీ చేస్తోంది. వారిని విచారిస్తూ ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేపడుతోంది.