హిమాచల్ సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖూ

హిమాచల్​ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖ్విందర్ సింగ్ సుఖూ ఎన్నికయ్యారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సుఖ్విందర్ సింగ్ సుఖూను ముఖ్యమంత్రిగా కాంగ్రెస్​ అధిష్ఠానం ఎంపిక చేసింది.  తాజాగా హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 68 అసెంబ్లీ నియోజకవర్గాలున్న హిమాచల్‌లో 35 సీట్లు సాధిస్తే అధికారంలోకి వచ్చే అవకాశం ఉండగా కాంగ్రెస్‌ 40 సీట్లలో గెలుపొందింది. 
 
అయితే సీఎం పదవి కోసం తీవ్ర పోటీ నెలకొన్నది. పలువురు నేతలు సీఎం పదవికి కోసం ప్రయత్నాలు చేశారు. మాజీ సీఎం వీరభద్ర సింగ్‌ సతీమణి, పీసీసీ చీఫ్‌ ప్రతిభా సింగ్‌ సీఎం పదవి కోసం గట్టిగా ట్రై చేసారు. ఆమెనే సీఎంగా ప్రకటించే అవకాశం ఉన్నదని ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్​ అధిష్ఠానం మాత్రం సుఖ్విందర్ సింగ్ సుఖూను ఖరారు చేసారు. 
 
ఆదివారం సీఎంగా సుఖ్విందర్​ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈయన రాష్ట్రంలోని నాదౌన్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. ఇక డిప్యూటీ సీఎం పదవికి ముకేశ్ అగ్నిహోత్రిని ఎంపిక చేశారు. ఈయన గతంలో రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభా పక్షనేతగా వ్యవహరించారు. ముకేశ్ అగ్నిహోత్రి హరోలీ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు.
 
కాంగ్రెస్‌లో సీఎం ఎవరనే దానిపై శుక్రవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. చివరకు రాత్రి వేళ.. సీఎల్పీ భేటీ అనంతరం నిర్ణయం తీసుకునే బాధ్యతను పార్టీ అధిష్ఠానానికి అప్పగిస్తూ ఏక వాక్య తీర్మానం చేశారు. 39 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్న ఈ సమావేశానికి అధిష్ఠానం పరిశీలకులుగా రాజీవ్‌ శుక్లా, భూపీందర్‌ హుడా, ఛత్తీ్‌సగఢ్‌ సీఎం భూపేష్‌ భగేల్‌ హాజరయ్యారు.