రాజ్యసభ వైస్‌చైర్మన్‌ ప్యానెల్‌ లో చోటుదక్కని విజయసాయిరెడ్డి

రాజ్యసభ వైస్ చైర్మన్ గా ఉపరాష్ట్రపతి  జగ్​దీప్​ ధన్​కర్ లాంఛనంగా బుధవారం బాధ్యతలు చేపట్టగానే వైసీపీ పార్లమెంటరీ పక్ష నాయకుడు విజయసాయిరెడ్డికి ఝలక్ ఇచ్చినట్లయింది. వైస్ చైర్మన్ ప్యానల్ సభ్యునిగా కొనసాగుతున్న ఆయనను తొలగించడం రాజకీయంగా కలకలం రేపుతున్నది.
రెండు రోజుల క్రితం ప్రకటన రాజ్యసభ వైస్‌చైర్మన్‌ ప్యానెల్‌ సభ్యుడుగా నియమించినట్లు రాజ్యసభ బులెటిన్‌లో ప్రకటించారు. దీనికి సాయిరెడ్డి కూడా స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా రాజ్యసభ ఛైర్మన్ కు ధన్యవాదాలు తెలిపారు. సభ నిర్వహణలో పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

 
అయితే, బుధవారం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాగానే ధన్‌ఖడ్‌ ప్రకటించిన వైస్‌ చైర్మన్‌ ప్యానెల్‌ సభ్యుల జాబితాలో ఆయన పేరు కనిపించలేదు. గతంలో వెంకయ్య నాయుడు రాజ్యసభ ఛైర్మన్ గా ఉన్న సమయంలో వైస్‌చైర్మన్‌ ప్యానెల్‌ సభ్యుడుగా విజయ సాయిరెడ్డి వ్యవహరించారు. ఇప్పుడు కొత్త ఛైర్మన్ తొలుత ప్రకటించిన జాబితాలో సాయిరెడ్డి పేరు ఉంది.
 
ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో ఉన్న సమయంలోనే ఛైర్మన్ కొత్త ప్యానెల్ సభ్యుల జాబితాను ప్రకటించారు. తొలి జాబితాలో కనిపించిన సాయిరెడ్డి పేరు తుది జాబితాలో లేదు. తొలుత విడుదలైన బులెటిన్‌లో భువనేశ్వర్‌ కలితా (బీజేపీ), ఎల్‌.హనుమంతయ్య (కాంగ్రెస్‌), తిరుచి శివ (డీఎంకే), సుఖేందు శేఖర్‌ రాయ్‌ (తృణమూల్‌ కాంగ్రెస్‌ ), డా.సస్మిత్‌ పాత్రా (బీజేడీ), సరోజ్‌ పాండే (బీజేపీ), సురేంద్రసింగ్‌ నాగర్‌(బీజేపీ), వి.విజయసాయిరెడ్డి(వైసీపీ) పేర్లున్నాయి.
 
 రాజ్యసభ వైస్‌ చైర్మన్‌ ప్యానెల్‌ సభ్యుల జాబితాను పునర్వ్యస్థీకరించామని, వారి నియామకాలు ఈ నెల  5 నుంచి అమలులోకి వస్తాయని కేపేర్కొంటూ  ఆయన ప్రకటించిన పేర్లలో విజయసాయిరెడ్డి తప్ప మిగతావారి పేర్లన్నీ ఉన్నాయి. దీంతో, అసలు అందరి పేర్లు యధాతధంగా ఉన్నా.. సాయిరెడ్డి పేరు మాత్రమే లేకపోవటం రాజకీయంగా విస్మయం కలిగిస్తున్నది.
 
సాంకేతిక కారణాలతో ఆయన పేరును తొలగించారా లేదా వైస్ చైర్మన్ స్వయంగా తప్పించారా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాలకు ఆశ్చర్యం కలిగిస్తున్నది. వైసిపి అసమ్మతి ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజ్యసభ కొత్త ఛైర్మన్ ను స్వయంగా కలిసి ఫిర్యాదు చేసిన ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకున్నారా? అనే వాదనలు వినిపిస్తున్నాయి.
 
 సాయిరెడ్డి ఈ మధ్య కాలంలో అనుచిత వ్యాఖ్యలతో సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టింగ్ లు చేస్తున్నారని, ఆయనను రాజ్యసభ కమిటీల నుంచి తప్పించాలని లిఖిత పూర్వకంగా కృష్ణంరాజు కోరారు. ఇప్పుడు రాజ్యసభ ఛైర్మన్ నిర్ణయం వెనుక ఈ ఫిర్యాదు ప్రభావితం చేసిందా? అనే చర్చ జరుగుతోంది.