పోలవరం ప్రాజెక్ట్​ ను ఒక రాష్ట్ర కోణంలోనే చూడలేం

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం ప్రాజెక్ట్​ ను ఒక రాష్ట్రం కోణంలోనే చూడలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోలవరంతో తమకు ముంపు సమస్యలు ఉన్నాయంటూ తెలంగాణ, ఒడిశా, చత్తీస్ గఢ్, రాష్ట్రాలకు చెందిన పలువురు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రాజెక్ట్ వల్ల భద్రాచలం ఆలయం ముంపునకు గురవుతుందని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌‌రెడ్డి కూడా మరో పిటిషన్‌‌ దాఖలు చేశారు.

అన్ని పిటిషన్లు కలిపి జస్టిస్‌‌ సంజయ్‌‌ కిషన్‌‌కౌల్‌‌ నేతృత్వంలోని బెంచ్ బుధవారం విచారణ జరిపింది. తొలుత కేంద్ర జలశక్తి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు గత ఆదేశాల ప్రకారం ప్రాజెక్ట్ నిర్మాణంపై 4 రాష్ట్రాలతో  మూడు సమావేశాలు నిర్వహించినట్లు బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) కూడా తన రిపోర్టును జలశక్తి శాఖకు సమర్పించిందని తెలిపారు.

అయితే, ముఖ్యమంత్రులతో సమయం నిర్వహించేందుకు కొంత సమయం పడుతుందని విన్నవించారు. ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌‌గఢ్‌‌ తమ  అభిప్రాయాలు జలశక్తి శాఖకు పంపాయని చెప్పారు. 

ఈ ఏడాది సెప్టెంబర్‌‌లో సంబంధిత రాష్ట్రాల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారని ఒడిశా ప్రభుత్వం తరఫు సీనియర్ లాయర్ కట్పాలియా బెంచ్ దృష్టికి తీసుకువచ్చారు. అయితే, సీఎంల సమావేశంపై ఎలాంటి పురోగతి లేదని తెలిపారు. ముంపుపై వివాదం ముగిసే వరకు ప్రాజెక్ట్ పనులు నిలిపివేయాలని విన్నవించారు.

అనంతరం తెలంగాణ తరఫు సీనియర్ అడ్వొకేట్ వైద్య నాధన్ వాదనలు వినిపిస్తూ ఈ ఏడాది గోదావరి వరదలు రావడంతో పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో ముంపు పెరిగిందని కోర్టుకు తెలిపారు. ముంపు నివారణకు ఏపీ సర్కార్ తగు చర్యలు తీసుకుంటే పోలవరం నిర్మాణంపై తమకెలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.

కేంద్రం తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాఠి జోక్యం చేసుకొని  ఆయా రాష్ట్రాల నుంచి సాంకేతిక అంశాలపై అభిప్రాయాలు డిసెంబరు 2న మంత్రిత్వశాఖకు చేరాయని తెలిపారు. రాష్ట్రాల మధ్య ఏర్పాటు చేసిన మొదటి సమావేశంలో అంశాల వారీగా ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పారు.

అన్ని వైపుల వాదనలు విన్న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం. ప్రాజెక్టు పనుల నిలిపివేతకు అనుమతి నిరాకరించింది. పోలవరం ప్రాజెక్ట్​ను ఒక రాష్ట్రం కోణంలోనే చూడలేమని వెల్లడించింది. సీఎంల సమావేశం తర్వాత వివాదంపై రిపోర్టు అందజేయడానికి కేంద్రానికి 2 నెలలు గడువు ఇస్తున్నామని వెల్లడించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 15కు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.