ఈసారి ఎన్నికల్లో ఎగిరేది కాషాయ జెండానే

‘‘రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల తీవ్ర వ్యతిరేకత కన్పిస్తోంది. నా పాదయాత్రలో ఎక్కడికి వెళ్లినా జనం తండోపతండాలుగా తరలివస్తున్న టీఆర్ఎస్ అరాచకాలను వివరిస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రం బాగోలేదు. ప్రజలంతా బీజేపీని ప్రత్యామ్నాయశక్తిగా చూస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎగిరేది కాషాయ జెండానే’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ భరోసా వ్యక్తం చేశారు. 
 
ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను దారిమళ్లించేందుకు కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నారని ఆయన చెప్పారు. కేసీఆర్ ఆరాచకాలపై తీవ్రస్థాయిలో ఉద్యమిస్తూ ప్రజలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అందులో భాగంగా వివిధ మోర్చాల ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై తీవ్రస్థాయిలో ఉద్యమించాలని సూచించారు. 
 
ఖానాపూర్ నియోజకవర్గంలో ఇక్బాల్ పూర్ సమీపంలోని పాదయాత్ర లంచ్ శిబిరం వద్ద మంగళవారం వివిధ మోర్చాల రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో సంజయ్ సమావేశమయ్యారు. పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బొమ్మ జయశ్రీతోపాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, యువ, మహిళా మోర్చాల రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
 
ఈ సందర్భంగా మోర్చాల పనితీరు, జిల్లాల వారీగా కమిటీల నియామకం, సంస్థాగత బలోపేతం కోసం చేపట్టాల్సిన కార్యాచరణతోపాటు రాబోయే రోజుల్ల్ ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.  ముందస్తు ఎన్నికల నేపథ్యంలో మోర్చాలన్నీ క్రియాశీలకంగా ఉండాలని, తీవ్రస్థాయిలో ఉద్యమించాలని సూచించారు.  అందులో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, ఆరోపణలను తిప్పికొడుతూ ప్రజల్లోనే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.