షర్మిలకు ఫోన్ లో ప్రధాని మోదీ పరామర్శ 

గుజరాత్ ఎన్నికలు పూర్తి కాగానే ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ వైపు దృష్టి సారించినట్లు స్పష్టం అవుతుంది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో తెలంగాణాలో అధికారం చేపట్టాలని బిజెపి కేంద్ర నాయకత్వం పట్టుదలగా ఉన్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం స్వయంగా ఫోన్ చేసి పరామర్శించారు. ఇటీవల జరిగిన ఘటనలకు ఆయన సానుభూతి తెలిపారు.
ఢిల్లీకి రావాలంటూ ఆమెకు ప్రధాని సూచించారు. ఒక మహిళని చూడకుండా.. కారులో ఉండగానే తీసుకువెళ్లడం అనేది దారుణమని విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని స్పష్టం చేశారు.  అంతేకాకుండా ఆ ఘటనను చూసి చాలా బాధపడ్డానని చెప్పారు. ఇది రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమని మోదీ పేర్కొన్నారు.
షర్మిలతో ప్రధాని సుమారు 10 నిముషాలు మాట్లాడారు. అంతకు ముందు, సోమవారం జీ-20పై నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి, షర్మిల సోదరుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద కూడా ప్రధాని మోదీ ఈ విషయాన్ని ప్రస్తావించారు.
తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపించి, కేసీఆర్‌ సర్కారుపై పోరాడుతున్న సొంత చెల్లెలు షర్మిలపై దాడి జరిగినా,  హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసినా, ఆమె కూర్చుని ఉండగానే కారును క్రేన్‌తో లాక్కెళ్లి ఠాణాకు తరలించినా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి స్పందించలేదు. ఈ సంఘటనలను ఖండించలేదు.
కానీ… ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘ఆ విషయం తెలిసి నాకే బాధ కలిగింది. ఇంత జరిగినా మీరెందుకు మాట్లాడలేదు?’ అని నేరుగా జగన్‌నే ప్రశ్నించడం రాజకీయంగా కలకలం చెందుతున్నది. ప్రధాని ప్రశ్నతో దిగ్బ్రాంతి చెంది, ఏం సమాధానం చెప్పాలో తెలియక, జగన్‌ తనదైన శైలిలో నవ్వుతూ మౌనంగా నిల్చున్నట్లు తెలిసింది.
తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల వాహనంపై వరంగల్‌ జిల్లా నర్సంపేటలో గత ఆదివారం రాళ్ల దాడి జరిగింది. అక్కడే ఆమె కాన్వాయ్‌కు నిప్పంటించారు. పోలీసులు ఆమెను బలవంతంగా హైదరాబాద్‌లోని నివాసానికి తరలించారు.
 ఆ మరుసటి రోజున, దీనిపై ప్రగతి భవన్‌ ముందే నిరసన వ్యక్తం చేస్తానంటూ ధ్వంసమైన కారు, కాన్వాయ్‌తో సహా బయలుదేరారు. కారును ఆమెనే నడుపుతూ ముందుకు కదిలారు. షర్మిలను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ఆమె కూర్చుని ఉండగానే కారును క్రేన్‌తో (టోయింగ్‌) లాక్కెళ్లి స్టేషన్‌లో కూర్చోబెట్టారు.
 షర్మిలను పరామర్శించేందుకు వెళ్తున్న తల్లి విజయలక్ష్మిని కూడా పోలీసులు నిలువరించారు. దాదాపు రోజంతా జరిగిన ఈ వరుస పరిణామాలు రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. షర్మిల రాజకీయ కార్యకలాపాలతో తమకు సంబంధంలేదని, వ్యక్తిగతంగా మాత్రం ఇది బాధాకరమని అదే రోజున ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం పేర్కొన్నారు. అంతకుమించి దీనిపై వైసీపీ వర్గాల నుంచి ఎలాంటి స్పందనా కనిపించలేదు.
బిజెపి నేతల ఖండన 

వైఎస్ షర్మిల అరెస్ట్‌ను తెలంగాణ బీజేపీ నేతలు వెంటనే ఖండించడం ఈ సందర్భంగా గమనార్హం. ఓ మహిళ పట్ల కేసీఆర్ సర్కారు విపరీతమైన అహంకారాన్ని ప్రదర్శించిందని, ఇదో హేయమైన చర్య అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలకు ధర్నాలు, పాదయాత్రలు చేసే హక్కు ఉంటుందన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్  ప్రభుత్వం అరెస్ట్‌ చేసే పద్ధతి, తీసుకుపోయే పద్ధతి దుర్మార్గమని మండిపడ్డారు. 

వైఎస్ షర్మిల క్యారవాన్‌ను టీఆర్ఎస్ కార్యకర్తలు తగలబెట్టడాన్ని ఖండిస్తున్నానని బండి సంజయ్ ట్వీట్ చేశారు. మహిళ అని కూడా చూడకుండా అరెస్టు చేయడం,ఆమె వాహనాన్ని తగలబెట్టడం కేసీఆర్ అరాచక పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు.  అలాగే ఈ ఘటనపై షర్మిల గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, డీజీపీ మహేందర్ రెడ్డిలకు ఫిర్యాదు చేశారు. షర్మిల అరెస్టును ఖండిస్తూ ఆమె ట్వీట్ చేశారు. షర్మిల ఆ మరుసటి రోజు గవర్నర్ ను స్వయంగా కలుసుకున్నారు.