తెలంగాణాలో లక్ష కోట్ల విలువైన రహదారులు 

తెలంగాణ సామాజిక, ఆర్థికాభివృద్ధిలో జాతీయ రహదారులు కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ. 1.04 లక్షల కోట్ల విలువ గల మరో 3,700 కి. మీల పొడవైన జాతీయ రహదారులను నిర్మిస్తున్నట్టు ఆయన తెలిపారు.

1947 నుండి 2014 వరకు తెలంగాణలో జాతీయ రహదారుల పొడవు 2,500 కిలో మీటర్లు కాగా, గడిచిన ఎనిమిదేళ్లలోనే 2,500 కిలో మీటర్ల పొడవైన జాతీయ రహదారులను నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్మించిందని హర్షం వ్యక్తం చేశారు.

రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు నిధుల కేటాయింపు 500 శాతం పెరిగిందని పేర్కొంటూ దేశంలో ప్రతి రోజూ నిర్మించే జాతీయ రహదారుల నిర్మాణం 300 శాతం పెరిగిందని, 2014-15 లో రోజుకు 12 కి. మీటర్ల పొడవు గల జాతీయ రహదారులను నిర్మించగా, 2020-21 నాటికి అది 3 రెట్లు పెరిగి 37 కి.మీటర్లకు పెరిగిందని తెలిపారు.

దేశంలో జాతీయ రహదారుల పొడవు 2014లో 91,287 కిలో మీటర్లు ఉండగా 2021 చివరికి దాదాపు 50 శాతం వృద్ధితో 1,41,000 కిలో మీటర్లకు పెరిగిందని పేర్కొన్నారు.

దేశానికి స్వాతంత్ర్యం లభించిన నాటి నుంచి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో జాతీయ రహదారుల పొడవు 2,500 కిలో మీటర్లు ఉండగా, కేవలం 8 సంవత్సరాల కాలంలో 100 శాతం వృద్ధితో రాష్ట్రంలో జాతీయ రహదారుల పొడవును 5 వేల కిలో మీటర్లకు పెంచినట్టు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని ఎన్నో రహదారులను 4 వరుసలుగా, 6 వరుసలుగా విస్తరించి రాష్ట్రంలో రహదారుల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచామని చెప్పారు.

ఇవే కాకుండా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు మొదలుకొని, మంజూరై నిర్మాణం మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులు, డీపీఆర్‌ను పూర్తి చేసుకొని మంజూరుకు సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులు, డీపీఆర్ రూపకల్పన పనులు జరుపుకుంటున్న ప్రాజెక్టులతో కలిపి  మొత్తం రూ. 1.04 లక్షల కోట్ల విలువ గల మరో 3,700 కి. మీటర్ల పొడవు గల తెలంగాణకు సంబంధించిన జాతీయ రహదారుల ప్రాజెక్టులు వివిధ దశలలో ఉన్నాయని కిషన్ రెడ్డి వెల్లడించారు.

తెలంగాణలోని నాలుగు దిశల నుంచి హైదరాబాద్ చేరుకునే వారు సులభంగా నగరంలోకి ప్రవేశించటానికి వీలుగా 350 కిలో మీటర్ల పొడవున నిర్మించనున్న రీజినల్ రింగ్ రోడ్డు నార్త్ భాగాన్ని ఇప్పటికే భారతమాల ప్రాజెక్టులో చేర్చగా, దాదాపు రూ. 20 వేల కోట్లతో నిర్మించనున్న సౌత్ భాగానికి సంబంధించిన డీపీఆర్ పనులు త్వరలోనే పూర్తి కానున్నాయని చెప్పారు.